మళ్లీ వచ్చింది... జావా! | Mahindra revives classic Jawa brand with 3 new motorcycles starting at Rs 1.55 lakh  | Sakshi
Sakshi News home page

మళ్లీ వచ్చింది... జావా!

Nov 16 2018 12:40 AM | Updated on Nov 16 2018 4:31 AM

 Mahindra revives classic Jawa brand with 3 new motorcycles starting at Rs 1.55 lakh  - Sakshi

ముంబై: గంభీరమైన సౌండుతో, ఠీవికి మారుపేరుగా దేశీ రోడ్లపై ఒకప్పుడు దర్జాగా తిరుగాడిన జావా మోటార్‌సైకిల్‌ బ్రాండ్‌.. మళ్లీ వాహన ప్రియుల కోసం వచ్చేసింది. పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా అనుబంధ సంస్థ క్లాసిక్‌ లెజెండ్స్‌ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దీన్ని మరోసారి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జావా ఫోర్టీ టూ, జావా, జావా పెరక్‌ పేరిట మూడు మోడల్స్‌ను దేశీ మార్కెట్లో గురువారం ఆవిష్కరించింది. 293 సీసీ సామర్థ్యంతో పనిచేసే ఈ బైక్‌ల ధర రూ.1.55 లక్షల నుంచి రూ.1.89 లక్షల దాకా ఉంది. తమ ద్విచక్ర వాహనాల విభాగానికి జావా సరైన జోడీగా మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా చెప్పారు. ‘సాధారణ వాహనాల్లా కాకుండా ఇది చాలా ప్రీమియం సెగ్మెంట్‌కి సంబంధించిన బైక్‌. జావాకి ఒక గొప్ప చరిత్ర, పేరు ఉన్నాయి. దాన్ని నిలబెట్టుకోవడంపైనే ప్రస్తుతం మా దృష్టంతా పెట్టాం. అమ్మకాల పరిమాణం గురించి పెద్దగా లక్ష్యాలేమీ నిర్దేశించుకోలేదు‘ అని ఆయన వివరించారు. ప్రస్తుతానికి దేశీ మార్కెట్‌పైనే దృష్టి పెట్టామని, ఎగుమతులకు కూడా అవకాశాలు ఉన్నాయని మహీంద్రా పేర్కొన్నారు.  

ఇండోర్‌లో తయారీ..: దేశీయంగా ప్రీమియం మోటార్‌సైకిల్‌ మార్కెట్‌ గణనీయంగా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో జావాను మళ్లీ తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా భావించినట్లు క్లాసిక్‌ లెజెండ్స్‌ సీఈవో ఆశీష్‌ జోషి పేర్కొన్నారు. గురువారం నుంచి ఆన్‌లైన్‌లో జావా బుకింగ్స్‌ ప్రారంభించామని,  డిసెంబర్‌ 7 నుంచి కస్టమర్లకు అందించనున్నామని తెలియజేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ దగ్గర పిఠంపూర్‌లో ఉన్న మహీంద్రా తయారీ ప్లాంటులో ఈ బైక్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా 5 లక్షల బైక్‌ల తయారీ సామర్థ్యం ఉన్నట్లు ఫి క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థాపకుడు అనుపమ్‌ తరేజా వెల్లడించారు. క్లాసిక్‌ లెజెండ్స్‌లో మహీంద్రా గ్రూప్‌నకు 60 శాతం వాటాలు ఉండగా, మిగతావి రుస్తుంజీ గ్రూప్, ఫి క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ వద్ద ఉన్నాయి.

జావా చరిత్ర ఇదీ..
మోటార్‌ సైకిలంటే.. మూడు దశాబ్దాల క్రితం దాకా జావా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్, యెజ్డీ, రాజ్‌దూత్‌ బైకుల పేర్లే ఎక్కువగా వినిపించేవి. ప్రస్తుతం రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కి ఉన్న క్రేజ్‌కన్నా ఎక్కువే అప్పట్లో జావాకి ఉండేది. కానీ ఆ తర్వాత జపాన్‌ కంపెనీల బైకులు భారత మార్కెట్‌ను ముంచెత్తిన తర్వాత ఇవి కనుమరుగయ్యాయి. మళ్లీ 2016లో దేశీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా భారత ఉపఖండంలో జావా మోటార్‌సైకిల్స్‌ తయారీ, విక్రయానికి లైసెన్సు తీసుకుంది. కానీ రెండేళ్ల పాటు ఎలాంటి ఊసు లేదు. నాలుగు నెలల క్రితం జావాను ప్రవేశపెడుతున్నామంటూ మహీంద్రా ప్రకటించిన తర్వాత ఇది మళ్లీ జీవం పోసుకుంది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 350కి పోటీగా బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు.. 

►చెకోస్లొవేకియాకి చెందిన ఫ్రాటిసెక్‌ జానెసెక్‌ 1929లో జావా మోటార్‌సైకిల్‌ను రూపొందించారు. అప్పట్లో వాండరర్‌ అనే మోటార్‌సైకిల్‌ సంస్థను కొనుగోలు చేసిన జానెసెక్‌.. తన పేరులోని తొలి అక్షరాన్ని వాండరర్‌లోని మొదటి అక్షరాన్ని కలిపి జావా అని కొత్త బైక్‌కు పేరు పెట్టారు. మొదట్లో 500 సీసీ బైక్స్‌ మాత్రమే తయారు చేసినా.. ఆ తర్వాత జనసామాన్యానికి చేరువయ్యే ఉద్దేశంతో 175 సీసీ బైక్‌లను, అటు పైన 250, 350 సీసీ బైక్‌లను  రూపొందించారు.  

►  1960లలో జావా మోటార్‌సైకిల్స్‌ భారత్‌లోకి ప్రవేశించాయి. రుస్తుం, ఫారూఖ్‌ ఇరానీలు ఏర్పాటు చేసిన ఐడియల్‌ జావా సంస్థ వీటిని దిగుమతి చేసుకుని విక్రయించేది. అనతికాలంలోనే బాగా పటిష్టమైన బైక్‌లుగా ఇవి ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇక్కడి డిమాండ్‌ను గుర్తించి అప్పట్లో మైసూర్‌లో తయారీ ప్లాంటును కూడా ఏర్పాటు చేశారు. 1961–71 మధ్య కాలంలో జావా కంపెనీ నుంచి లైసెన్సు తీసుకుని ఐడియల్‌ జావా వీటిని ఇక్కడ తయారు చేసేది. అటుపై 1971 నుంచి జావా సాంకేతిక సహకారంతో ఐడియల్‌ జావా కంపెనీ కొత్తగా యెజ్డీ పేరిట మోటార్‌సైకిల్స్‌ను విక్రయించింది. ఆ తర్వాత యూరప్‌లో పలు ప్రాంతాల్లో జావా మోటార్‌సైకిల్స్‌ తయారీ కొనసాగినప్పటికీ.. 1996లో భారత్‌లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇన్నాళ్లకు మళ్లీ మొదలయ్యాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement