
సాక్షి, న్యూఢిల్లీ: వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ ఏడాదిలో రెండవసారి వినియోగదారులపై మళ్లీ వంటగ్యాస్ భారం పడింది. 14.2 కిలోల ఎల్‌పీజీ సబ్సిడీ సిలిండర్ ధరపై నామమాత్రంగా రూ. 25పైసలు, సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ.5 చొప్పున పెరిగింది. సవరించిన ధరలు ఏప్రిల్ 1వ తేదీనుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్) ఒక ప్రకటన జారీ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతోపాటు, కరెన్సీ మారకపు రేటు ఒడిదుడుకుల కారణంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు ప్రభావితమవుతున్నాయి. హైదరాబాద్‌లో నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.762.35గా ఉంది. డిల్లీలో రూ.706. 50గా ఉంది.
గత మూడు నెలలు (నవంబరునుంచి ఫిబ్రవరి దాకా) తగ్గుముఖం పట్టిన సిలిండర్ ధరలు మార్చి 1 తేదీన పెరుగుదలను నమోదు చేయగా, మళ్లీ ఏప్రిల్ నెలలో పెరిగాయి. మార్చి నెలలో సబ్సిడీ సిలిండర్ ధరను రూ.2.08, నాన్ సబ్సిడీ సిలిండర్‌పై రూ.42.50 పెంచిన సంగతి తెలిసిందే. అలాగే ఏవియేషన్ టర్బైన్ గ్యాస్(ఏటీఎఫ్ ఫ్యూయెల్) భారీగా పెంచింది.