గతవారం బిజినెస్‌ | Last week's business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Aug 21 2017 12:38 AM | Updated on Aug 11 2018 8:24 PM

గతవారం బిజినెస్‌ - Sakshi

గతవారం బిజినెస్‌

దేశంలో టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య జూన్‌ నెల చివరకు 121 కోట్ల మార్క్‌ను అధిగమించింది. మే నెల చివరిలో 120.49 కోట్లుగా ఉన్న టెలికం యూ జర్ల సంఖ్య జూన్‌ చివరకు 121.08 కోట్లకు పెరిగింది.

121 కోట్లు దాటిన టెలికం సబ్‌స్క్రైబర్లు
దేశంలో టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య జూన్‌ నెల చివరకు 121 కోట్ల మార్క్‌ను అధిగమించింది. మే నెల చివరిలో 120.49 కోట్లుగా ఉన్న టెలికం యూ జర్ల సంఖ్య జూన్‌ చివరకు 121.08 కోట్లకు పెరిగింది. టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ ఈ విషయాలను వెల్లడించింది. మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య నికరంగా 60 లక్షలకుపైగా పెరుగుదలతో 118.6 కోట్లకు చేరింది. వీరిలో 102.27 కోట్ల మంది యాక్టివ్‌గా ఉన్నా రు. ఇక ల్యాండ్‌లైన్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.4 కోట్లకు క్షీణించింది.  

రిలయన్స్, బీపీకి 1,700 కోట్ల జరిమానా
గత ఆర్థిక సంవత్సరం కేజీడీ–6 క్షేత్రాల నుంచి నిర్దేశిత లక్ష్యాలకన్నా తక్కువగా గ్యాస్‌ ఉత్పత్తి చేసినందుకు గాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థలపై కేంద్రం మరో 264 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1,700 కోట్లు) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్‌ 1 నుంచి దాదాపు ఆరేళ్లుగా లక్ష్యాలను సాధించలేకపోవడం వల్ల విధించిన మొత్తం పెనాల్టీ సుమారు 3.02 బిలియన్‌ డాలర్లకి (దాదాపు రూ. 19,500 కోట్లు) చేరిందని చమురు శాఖ తెలిపింది.

 బంగారం ఎగుమతులపై కేంద్రం నిషేధం
కేంద్రం 22 క్యారెట్లకుపైన స్వచ్ఛత గల బంగారం ఉత్పత్తుల ఎగుమతులను నిషే ధించింది. బంగారం ఉత్పత్తుల రౌండ్‌ ట్రి ప్పింగ్‌ను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 8 క్యారెట్లు నుంచి 22 క్యారెట్ల వరకు స్వచ్ఛత గల బంగారం ఎగుమతులకే అనుమతులున్నాయి.

కొత్త ప్రీమియం ఆదాయంలో 47% వృద్ధి
దేశంలోని మొత్తం 24 జీవిత బీమా కంపెనీల కొత్త ప్రీమియం ఆదాయంలో జూలై నెలలో 47.4% వృద్ధి నమోదయ్యింది. ఇది రూ.20,428 కోట్లకు చేరింది. కాగా గతేడాది ఇదే కాలంలో సంస్థల కొత్త ప్రీమియం ఆదాయం రూ.13,854 కోట్లుగా ఉంది. ఐఆర్‌డీఏ గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీ ప్రీమియం ఆదాయం 51% వృద్ధితో రూ.10,738 కోట్ల నుంచి రూ.16,255 కోట్లకు పెరిగింది. ఇక మిగిలిన 23 ప్రైవేట్‌ సంస్థల ప్రీమియం ఆదాయం 34% వృద్ధితో రూ.3,117 కోట్ల నుంచి రూ.4,173 కోట్లకు ఎగిసింది.  

త్వరలో కొత్త రూ.50 నోట్లు
ఆర్‌బీఐ త్వరలో మహాత్మా గాంధీ నూతన సిరీస్‌లో కొత్త రూ.50 నోట్లను తీసుకురానుంది. ఇవి నీలి (ఫ్లోరోసెంట్‌ బ్లూ) రంగులో ఉంటాయి. వీటిపై ఒకవైపు భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథం, స్వచ్ఛ్‌ భారత్‌ లోగో.. మరొకవైపు మహాత్మా గాంధీ, అశోక స్తంభం చిహ్నం ఉంటాయి.

ఉద్దేశపూర్వక ఎగవేతలు 92,000 కోట్లు
ప్రభుత్వ బ్యాంకులకు ఉద్దేశపూర్వక రు ణ ఎగవేతలు 20% పెరిగిపోయాయి. 2016–17 ఆర్థిక సంవత్సరం చివరికి 9,000 మంది రూ.92,376 కోట్ల మేర బ్యాంకులకు ఎగ్గొట్టారు. 2016 మార్చి నాటికి ఇలా ఉద్దేశ పూర్వకంగా చెల్లించని రుణాల మొత్తం రూ.76,685 కోట్లుగానే ఉంది. ఇక ఉద్దేశపూర్వక ఎగవేత కేసులు ఈ ఏడాది మార్చి నాటికి  8,915కు పెరిగాయి.    

కాల్‌డ్రాప్స్‌ ఉదంతాల్లో కఠిన చర్యలు
కాల్‌డ్రాప్స్‌ సమస్య పరిష్కారంపై ట్రాయ్‌ మరింతగా దృష్టి సారించింది. వరుసగా మూడు త్రైమాసికాలు ఆపరేటర్లు గానీ ప్రమాణాలు పాటించకపోతే రూ. 10 లక్షల దాకా జరిమానా చెల్లించాల్సి వచ్చేలా కఠినతరమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement