మా బిడ్డలు ఆకలితో చచ్చిపోతే..బాధ్యులెవరు?

JetAirways Employees Appeal to Bail Out the Ccarrier - Sakshi

జెట్‌ ఎయిర్‌వేస్‌​ సంక్షోభం ఉద్యోగుల పాలిట అశనిపాతంలా తాకింది.  సంస్థలోని ఒక్కో ఉద్యోగిది ఒక్కో గాథ. అర్థాంతరంగా ఉపాధి కోల్పోయిన ఉద్యోగి పరిస్థితికి అద్దం పడుతున్న వారి ఆవేదన వర్ణనాతీతం. తమ భవిష్యత్తును తలుచుకొని కన్నీరుమున్నీరవుతున్న వైనం కలవర పరుస్తోంది. రుణ వితరణకు సంబంధించి ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతోబుధవారం రాత్రి నుంచి అన్ని సర్వీసులనూ తాత్కాలికంగా రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. దీంతో దాదాపు 22వేలమందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ను ఆదుకునేందుకు  ఫౌండర్‌ నరేష్‌ గోయల్‌ సంస్థనుంచి తప్పుకుంటే.. రూ.1,500 కోట్ల మేర నిధులను సమకూరుస్తామని ఎస్‌బీఐ కన్సార్షియం చెప్పింది. దీని ప్రకారం ఆయన కంపెనీని వీడారు. కానీ ఇపుడు కనీసం 400కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా బ్యాంకులు అంగీకరించడంలేదు. ఇందులో తప్పెవరిది? ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని ఉద్యోగులు మండిపడ్డారు. తమ ఉద్యోగాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? మాజీ ఫౌండర్‌ నరేష్‌ గోయాల్‌? లేక ఎస్‌బీఐ యాజమాన్యమా అని ప్రశ్నిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డలు ఆకలితో చచ్చిపోతోంటే ఎవరూ పట్టించుకోవడంలేదు. వారికి ఓట్లు మాత్రమే కావాంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని... తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ కష్టాల్ని గుర్తించి జెట్‌ ఎయిర్‌వేస్‌ను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

తమకు రెండునెలలుగా వేతనాలు లభించకపోవడంతో తమ పిల్లల స్కూలు ఫీజులు, లోన్ల ఈఎంఐలు, ఇలా చాలా బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ప్రథమేష్ (27)ది కూడా ఇదే ఆవేదన.

సంస్థమీద తనకు పూర్తి విశ్వాసం ఉందని సీనియర్‌ ఉద్యోగి అనిల్‌ సాహు(50) ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత సునామీ ఉపద్రవంముంచుకొచ్చిందని, దీన్నుంచి కోలుకుని త్వరలోనే మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్నారు. కానీ 50 ఏళ్ల వయసులో మరో ఎయిర్‌లైన్స్ సంస్థలో జాబ్ సంపాదించుకోవడం తేలిక కాదన్నారు.  అయితే  ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా సగం శాలరీకే చేరాల్సి వస్తుందని మరికొందరు ఉద్యోగులు పేర్కొన్నారు.   ఏడేళ్లుగా పనిచేస్తున్న మరో ఉద్యోగి అమీనా, ఇప్పటికు తనకు తనకు లాంటి ఇబ్బంది లేదని, తిరిగి తమ సంస్థ పుంజుకుంటుందని భావిస్తున్నానన్నారు.

జీతాల్లేవు.. అందుకే ప్రాఫిడ్‌ ఫండ్‌ విత్‌ డ్రా చేసి మరీ  పిల్లల ఫీజులు కట్టాను.  మా అమ్మ (70) వైద్య ఖర్చులు భరించడం ఇపుడొక సవాల్‌ - శంకర్‌ చక్రవర్తి (50) సీనియర్‌ అస్టిస్టెంట్‌ ఇంజనీర్‌. 1993నుంచి సంస్థలో పనిచేస్తున్న ఈయన జీతం నెలకు రూ.80వేలు.

జెట్‌ ఎయిర్‌వేస్‌లో చేరినపుడు ఎన్నో కలలు కన్నాను. అందంతా మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయింది - రమన్‌ రాజపుత్‌ (26) క్యాబిన్‌  క్రూ

నేను సింగిల్‌ పేరెంట్‌ని. 12 ఏళ్ల  కొడుకుని ఎలా పోషించాలి. భవిష‍్యత్తు అగ్యమగోచరంగా ఉంది -మోనికా బక్షి (42) కస్టమర్‌ సర్వీస్‌ అసిస్టెంట్‌ 

మరోవైపు సంస్థ సంక్షోభం గురించి ఎవరూ మీడియాతో మాట్లాడరాదంటూ జెట్‌ ఎయిర్‌వేస్‌ తమ సిబ్బందికి సూచించింది. జెట్‌ కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top