ఇన్వెస్కో ఇండియా గ్రోత్‌ ఆపర్చూనిటీస్‌ 

Invesco announces cash distributions for Canadian - Sakshi

లక్ష్యాలకు తోడ్పడే పథకం

దీర్ఘకాలంలో మంచి నిధిని సమకూర్చుకోవాలని ఆశించే వారు పరిశీలించ తగిన పథకాల్లో ఇన్వెస్కో ఇండియా గ్రోత్‌ ఆపర్చూనిటీస్‌ కూడా ఒకటి. సెబీ ఆదేశాలకు పూర్వం ఈ పథకం పేరు ‘ఇన్వెస్కో ఇండియా గ్రోత్‌’గా ఉండేది. సెబీ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో మార్పులు, చేర్పులకు ఆదేశించిన నేపథ్యంలో ఈ పథకం పెట్టుబడుల విధానమూ మారిపోయింది. గతంలో మల్టీక్యాప్‌ ఫండ్‌గా ఉన్న ఇది ఎక్కువగా లార్జ్‌క్యాప్‌లో 70–80 శాతం పెట్టుబడులు పెట్టేది. ఇప్పుడు మార్పుల నేపథ్యంలో లార్జ్‌ అండ్‌ మిడ్‌క్యాప్‌గా మారిపోయింది. అంటే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌లో 35 శాతం చొప్పున కనీసం ఇన్వెస్ట్‌ చేయాలి. గత కొన్ని నెలలుగా ఈ పథకం తన పోర్ట్‌ఫోలియోకు మార్పులు చేసింది. మిడ్‌క్యాప్‌ విభాగంలో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసింది. ఫిబ్రవరి నుంచి చూస్తే మిడ్‌క్యాప్స్‌లో 27–34 శాతం మధ్య పెట్టుబడులు ఉన్నాయి. ఈ పథకం ప్రామాణిక సూచీ బీఎస్‌ఈ 100 నుంచి బీఎస్‌ఈ 250గా మారిపోయింది.  

పెట్టుబడుల విధానం 
ఈ పథకం గతంలో స్టాక్స్‌ ఎంపికకు బాటమ్‌ అప్‌ విధానాన్ని అనుసరించేది. మారిన సమీకరణాల నేపథ్యంలో బాటమ్‌ అప్, టాప్‌డౌన్‌ విధానాలను అనుసరించనుంది. ఆయా రంగాలకు సంబంధించిన అంశాలతో పని లేకుండా స్టాక్స్‌వారీగా ఎంపిక విధానం నుంచి, ఆర్థిక, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా స్టాక్స్‌ ఎంపికగా విధానం మారిపోయింది. అయినప్పటికీ ఈ పథకం మెరుగైన రాబడులను ఇస్తుందన్న అంచనా ఉంది. స్టాక్స్‌ ఎంపికలో మంచి ట్రాక్‌ రికార్డు, అన్ని కాలాల్లోనూ మంచి రాబడులను అందించిన పథకం కావడమే ఈ అంచనాలకు బలం. అధిక రిస్క్‌ తీసుకునే వారు, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్స్‌పోజర్‌ ఎక్కువగా ఉన్నా ఫర్వాలేదనుకునే వారు ఈ పథకాన్ని నిస్సంకోచంగా ఎంచుకోవచ్చు.  

గత పనితీరు 
ఏడాది నుంచి ఐదేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు నూతన ప్రామాణిక సూచీ అయిన బీఎస్‌ఈ 250తో పోలిస్తే మెరుగ్గా ఉండడం గమనార్హం. ఏడాది కాలంలో ఇన్వెస్కో ఇండియా గ్రోత్‌ ఆపర్చూనిటీస్‌ 17.9 శాతం వార్షిక రాబడులను ఇస్తే, ప్రామాణిక సూచీ రాబడులు 14.9 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు 11.3 శాతం అయితే, ప్రామాణిక సూచీ రాబడులు 11.8 శాతం. ఐదేళ్ల కాలంలో ఈ పథకం 18.7 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇవ్వగా, ప్రామాణిక సూచీ రాబడులు 17.3 శాతంగా ఉన్నాయి. అంటే కేటగిరీని మించి రాబడులను అందించినట్టు తెలుస్తోంది. పథకం కింద ఉన్న నిధుల్లో 95 శాతాన్ని ఇన్వెస్ట్‌ చేసి నగదు నిల్వలను తక్కువే ఉంచుకుంది. 20 రంగాల నుంచి సుమారు 41 స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంది. బ్యాంకింగ్‌ రంగానికి ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. 24 శాతం ఎక్స్‌పోజర్‌ కలిగి ఉంది. ఫైనాన్స్, పెట్రోలియం, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లోనూ చెప్పుకోతగ్గ ఎక్స్‌పోజర్‌ తీసుకుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top