హైదరాబాద్‌లో ఇంటెల్‌ డిజైన్‌ సెంటర్‌

Intel launches design, engineering centre in Hyderabad - Sakshi

ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ఏడాదిలో 1,200 మంది నియామకం

కంపెనీ ఎస్‌వీపీ రాజా ఎం కోడూరి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చిప్‌ తయారీ దిగ్గజం ఇంటెల్‌ ఇండియా... డిజైన్, ఇంజనీరింగ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. 3 లక్షల చదరపుటడుగుల విస్తీర్ణంలో 1,500 సీట్ల సామర్థ్యంతో దీనిని నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సిబ్బంది పరంగా కొత్త సెంటర్‌ ఏడాదిలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంటుందని ఇంటెల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజా ఎం కోడూరి ఈ సందర్భంగా తెలిపారు. ఎక్సా స్కేల్‌ సూపర్‌ కంప్యూటర్‌ అభివృద్ధిలో హైదరాబాద్‌ కేంద్రం పాలు పంచుకుంటుందని కూడా వెల్లడించారు. ఈ సూపర్‌ కంప్యూటర్‌ యూఎస్‌లో 2021లో, భారత్‌లో 2022లో రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు.

మూడు లక్షల ఉద్యోగాలు..
వచ్చే నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో తెలంగాణలో 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ‘ఇప్పటికే ఈ రంగంలో 30,000 పైచిలుకు మందికి ఉద్యోగాలు లభించాయి. రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎలక్ట్రానిక్స్‌ తయారీ క్లస్టర్లు రెండూ నిండిపోయాయి. మరో భారీ తయారీ క్లస్టర్‌ కోసం కేంద్రాన్ని కోరాం. అక్కడి నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న టి– వర్క్స్‌ మూడు నాలుగు నెలల్లో ప్రారంభం కానుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్‌ రంగ కంపెనీలు తమ ఆవిష్కరణల తాలూకు నమూనాలను రూపొందించుకోవచ్చు’ అని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top