
రాజీనామా చేసిన ఇంటెల్ సీఈవో బ్రియాన్ క్రజానిక్
ఇంటెల్ సీఈవో బ్రియాన్ క్రజానిక్ రాజీనామా చేశారు. క్రజానిక్ కంపెనీకి రాజీనామా చేసిన విషయాన్ని ఇంటెల్ గురువారం ప్రకటించింది. ఆయన రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. క్రజానిక్ స్థానంలో తాత్కాలిక సీఈవోగా చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ రాబర్ట్ స్వాన్‌ను నియమించినట్టు కంపెనీ వెల్లడించింది. ఇంటెల్ ఉద్యోగినితో ఆయన రిలేషన్‌షిప్(సంబంధం) కొనసాగించడంతో, క్రజానిక్‌పై కంపెనీ వేటు వేసింది. మేనేజర్లందరికీ వర్తించే కంపెనీ నాన్-ఫ్రటర్నైజేషన్ పాలసీని ఉల్లంఘించిన కారణంగా క్రజానిక్‌పై అంతర్గత, బహిరంగ విచారణ కూడా జరుపుతోంది కంపెనీ. ఫ్రటర్నైజేషన్ పాలసీ అంటే సంస్థల్లో ఆధిపత్య స్థానంలో ఉన్నవారు, వారికంటే తక్కువ స్థానంలో ఉన్నవారితో రొమాంటిక్ సంబంధాన్ని కలిగి ఉండటం. ఉదాహరణకు సూపర్‌వైజర్, సబార్డినేట్‌తో సంబంధాన్ని కొనసాగించడం లాంటిది.
ఇంటెల్ సీఈవో రాజీనామాను వెంటనే ఆమోదించామని, దీంతో ఉద్యోగులందరూ ఇంటెల్ విలువలకు, సంస్థ ప్రవర్తన నియమావళికి కట్టుబడి ఉండాలని సూచిస్తుందని కంపెనీ తెలిపింది. ఇంటెల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ప్రస్తుతం కొత్త సీఈవోను వెతకడం ప్రారంభించారని పేర్కొంది. సంస్థ లోపల, వెలుపల అభ్యర్థులలో ఒకరిని కంపెనీకి శాశ్వత సీఈవోగా నియమించనున్నట్టు చెప్పింది. ఇంటెల్ ఎగ్జిక్యూటివ్‌గా క్రజానిక్ గత దశాబ్దం కాలంగా ఉంటున్నారు. 2013లో ఆయన సీఈవో బాధ్యతలను చేపట్టారు. 1982లో క్రజానిక్ ఇంటెల్‌లో చేరారు.
ఈ ఉదయమే ఇంటెల్ తన వెబ్‌సైట్ నుంచి క్రజానిక్ బయోగ్రఫీని కూడా తొలగించింది. క్రజానిక్, ఉద్యోగినితో సంబంధాన్ని కొనసాగిస్తున్నారని తెలియగానే, ఆయన్ని తన పదవి నుంచి దిగిపోవాలని కంపెనీ ఆదేశించింది. గతేడాదే క్రజానిక్, కంపెనీలో తను కలిగి ఉన్న సుమారు 39 మిలియన్ విలువైన షేర్లను అమ్మేశారు. అయితే క్రజానిక్ ఆధ్వర్యంలో కంపెనీ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగింది. ఇంటెల్‌ను పీసీ సెంట్రిక్ కంపెనీ నుంచి డేటా సెంట్రిక్ కంపెనీగా ఆయనే రూపుదిద్దారు. కంపెనీ స్టాక్ కూడా 120 శాతం ఎగిసింది.