ఇక ఇన్‌స్టంట్‌ ఈ–పాన్‌ కార్డులు! | Instant E-PAN cards! | Sakshi
Sakshi News home page

ఇక ఇన్‌స్టంట్‌ ఈ–పాన్‌ కార్డులు!

Jul 2 2018 12:41 AM | Updated on Jul 2 2018 11:20 AM

Instant E-PAN cards! - Sakshi

న్యూఢిల్లీ: వ్యక్తిగత, వ్యాపార అవసరాలరీత్యా తక్షణం పాన్‌ కార్డ్‌లను పొందాలనుకునే వారికోసం ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ఇన్‌స్టంట్‌ ఈ–పాన్‌ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. తొలిసారిగా పాన్‌ నంబర్‌ కోసం దరఖాస్తు చేసే వ్యక్తులకు ఆధార్‌తో అనుసంధానమైన కేటాయింపు వ్యవస్థను ప్రారంభించింది. ‘ఆధార్‌ కార్డులు ఉన్నవారెవరైనాసరే ఇన్‌స్టంట్‌ ఈ–పాన్‌ సేవలను పరిమితకాలంపాటు ఉచితంగా పొందొచ్చు’ అని ఐటీ శాఖ వెల్లడించింది.

‘ఈ వ్యవస్థలో పాన్‌కు దరఖాస్తు చేసిన వారికి ఆధార్‌తో జత అయిన మొబైల్‌ నంబర్‌కు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌(ఓటీపీ) వస్తుంది. దీన్ని ఎంటర్‌ చేస్తే క్షణాల్లో ఈ–పాన్‌ నంబర్‌ కేటాయింపు పూర్తవుతుంది. ఆధార్‌లో ఉన్న విధంగానే పేరు, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్, అడ్రస్‌ ఇతరత్రా వివరాలన్నీ కొత్త పాన్‌లో పొందుపరుస్తారు’ అని వివరించింది.

స్వదేశంలో నివసిస్తున్న భారతీయులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు(హెచ్‌యూఎఫ్‌), సంస్థలు, ట్రస్టులు, కంపెనీలు మాత్రమే ఈ–పాన్‌ సౌకర్యాన్ని వినియోగించుకోగలరని పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఈ–పాన్‌ నంబర్‌ కేటాయింపు జరిగిన తర్వాత కొద్ది రోజులకు పాన్‌ కార్డును పోస్ట్‌ ద్వారా పంపుతారని ఐటీ అధికారి వెల్లడించారు. ఈ–పాన్‌కు
www.incometaxindiaefiling.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement