పెట్టుబడులు, వినియోగమే భారత్‌కు దన్ను!

India's GDP expected to accelerate moderately to 7.5% in 2019-20 - Sakshi

2019–20లో వృద్ధి 7.5 శాతం

ప్రపంచబ్యాంక్‌ నివేదిక

వాషింగ్టన్‌: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) 7.5 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్‌ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. దేశంలో పెట్టుబడుల పరిస్థితి పటిష్టం అవుతోందని,  ఎగుమతులు మెరుగుపడుతున్నాయని, వినియోగ పరిస్థితులు బాగున్నాయని ప్రపంచబ్యాంక్‌ ఈ నివేదికలో పేర్కొంది. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాసహా పలు ఆర్థిక సంస్థలతో అంచనాలతో పోల్చితే, ప్రపంచబ్యాంక్‌ ప్రస్తుత వృద్ధి అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం. త్వరలో జరగనున్న ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) స్పింగ్‌ సమావేశాల నేపథ్యంలో విడుదలైన తాజా నివేదికలో  ముఖ్యాంశాలు చూస్తే...

► 2018–2019లో భారత్‌ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా. ఇది మరింత మెరుగుపడుతుందనడానికి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి.  

► 2018–19 మొదటి మూడు త్రైమాసిక గణాంకాలను (ఏప్రిల్‌–డిసెంబర్‌) పరిశీలిస్తే, వృద్ధి ఏ ఒక్క రంగానికే పరిమితం కాకుండా, విస్తృత ప్రాతిపదికన ఉంది. సేవల రంగం కొంత తగ్గినా, పారిశ్రామిక వృద్ధిరేటు మాత్రం 7.9 శాతంగా ఉంది.  

► వ్యవసాయ రంగం 4 శాతం వృద్ధి మంచి ఫలితమే.

► డిమాండ్‌ కోణంలో చూస్తే, దేశీయ వినియోగం వృద్ధి పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. పెట్టుబడులు, ఎగుమతుల వృద్ధి ధోరణి కూడా బాగుంది. మూడవ త్రైమాసికంలో చూస్తే, పలు రంగాల్లో సమతౌల్యమైన డిమాండ్, వృద్ధి పరిస్థితులు కనిపించాయి.  

► గడిచిన ఆర్థిక సంవత్సరం (2018–19) ద్రవ్యోల్బణం పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉన్నాయి. ఆహార ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉన్నాయి. ద్రవ్యోల్బణం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా 4 శాతంలోపే ఉంటుందని భావించడం జరుగుతోంది.  

► దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య మధ్య నికర వ్యత్యాసం– కరెంట్‌ అకౌంట్‌లోటు, అలాగే ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు అదుపులోనే ఉన్నాయి. ఎగుమతులు పెరుగుతుండడం, తక్కువ ముడి చమురు దిగుమతుల వల్ల దేశానికి తగ్గే చమురు బిల్లు భారం కరెంట్‌ అకౌంట్‌ లోటును 1.9%కి (2019–20 జీడీపీ విలువలో) కట్టడిచేసే అవకాశంఉంది. అలాగే ద్రవ్యలోటు 3.4%కి దాటకపోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top