ఐబీఎం పోటీలో భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల సత్తా

Indian Team Wins IBM Award to Flooding in Country - Sakshi

న్యూయార్క్‌: భారత ఉపఖండం ఏటా ఎదుర్కునే వరదలను సమర్థవంతంగా అడ్డుకునే పరిష్కార మార్గాన్ని చూపిన భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల బృందాన్ని 5 వేల డాలర్ల ప్రైజ్‌మనీ వరించింది. వరదలను సమర్థంగా అడ్డుకుని, అనేకమంది జీవితాలను కాపాడే ఈ పరిష్కారాన్ని కనుగొన్నందుకు గాను టెక్‌ దిగ్గజం ఐబీఎం ఈ ప్రైజ్‌మనీని ఆ బృందానికి అందజేసింది. ఐబీఎం, డేవిడ్‌ క్లార్క్‌ కాజ్‌ ఫౌండేషన్‌ కాల్‌ ఫర్‌ కోడ్‌–2019 ఆసియా–పసిఫిక్‌ ప్రాంతానికి సంబంధించిన అవార్డులను శనివారం ప్రకటించింది. ‘పూర్వ సూచక్‌’ పేరుతో కాగ్నిజెంట్‌ పుణే క్యాంపస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సిద్దమ్మ తిగడి, గణేశ్‌ కదం, సంగీత నాయర్, శ్రేయాస్‌ కులకర్ణిలు సంయుక్తంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు తొలి బహుమతి గెలుచుకుంది.

ఈ విధానంలో వరదలను అడ్డుకునేందుకు గాను క్రమం తప్పకుండా రిజర్వాయర్లు, డ్యామ్‌లు వంటి వాటిలో నీటి స్థాయిలను గమనిస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన సమాచారంతోపాటు వాతావరణ సూచనల సమాచారాన్ని సేకరిస్తారు. ఈ మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి వరదలను అంచనా వేస్తారు. అనంతరం బ్లాక్‌చైన్‌ సాంకేతికతను వినియోగించి ఈ వివరాలను ప్రభుత్వ సంస్థలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ ఏజెన్సీలకు అందుబాటులో ఉంచుతారు. ఇక కృత్రిమ మేథస్సు, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను ఉపయోగించి అగ్నిమాపక సిబ్బంది కోసం రూపొందించిన ప్రొమీటియోకు కాల్‌ ఫర్‌ కోడ్‌ –2019 గ్లోబల్‌ అవార్డు దక్కింది. ఇందుకు గాను 2 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. గ్లోబల్‌ రన్నరప్‌ స్థానాన్ని భారత్, చైనా, అమెరికాలకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అభివృద్ధి చేసిన ‘స్పారో’కు దక్కింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top