సంపన్నుల భారత్ | India has Fourth Largest Population of Millionaires in Asia Pacific: Report | Sakshi
Sakshi News home page

సంపన్నుల భారత్

Jan 20 2016 1:21 AM | Updated on Sep 3 2017 3:55 PM

సంపన్నుల భారత్

సంపన్నుల భారత్

భారత్‌లో సంపన్నులు పెరుగుతున్నారు. సంపన్నుల సంఖ్య ప్రామాణికంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ 4వ స్థానంలో...

* దేశంలోని ధనికుల సంఖ్య 2.36 లక్షలు
* ఆసియా పసిఫిక్ ప్రాంతంలో నాలుగవ స్థానం
* అగ్రస్థానాల్లో జపాన్, చైనా, అస్ట్రేలియా
* 2025 నాటికి 4.83 లక్షలకు దేశీ సంపన్నుల సంఖ్య!


న్యూఢిల్లీ: భారత్‌లో సంపన్నులు పెరుగుతున్నారు. సంపన్నుల సంఖ్య ప్రామాణికంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. భారత్‌లో సంపన్నులు 2.36 లక్షల మంది ఉన్నారు. ఇక 12.60 లక్షల మంది సంపన్నులతో జపాన్ అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో చైనా (6.54 లక్షల మంది), ఆస్ట్రేలియా (2.90 లక్షల మంది) కొనసాగుతున్నాయి.

‘న్యూ వరల్డ్ వెల్త్’కు సంబంధించిన ‘ఆసియా పసిఫిక్-2016’ వెల్త్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 1 మిలియన్ డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ నికర ఆస్తులను కలిగిన వ్యక్తులను సంపన్నులుగా పరిగణలోకి తీసుకుంటారు. కాగా టాప్ 10లో సింగపూర్ (2.24 లక్షల మంది, ఐదవ స్థానం), హాంకాంగ్ (2.15 లక్షల మంది, ఆరవ స్థానం), దక్షిణ కొరియా (1.25 లక్షల మంది, 7వ స్థానం), తైవాన్ (98,200 మంది, 8వ స్థానం), న్యూజిలాండ్ (89,000 మంది, 9వ స్థానం), ఇండోనేసియా (48,500, 10వ స్థానం) ఉన్నాయి. ఇక ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 35 లక్షల మంది సంపన్నులు ఉన్నారు. వీరందరి సంపద విలువ 17.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.
 
15 ఏళ్లలో 115 శాతం వృద్ధి
ఆసియా పసిఫిక్  ప్రాంతలో సంపన్నుల సంఖ్య గత 15 ఏళ్లలో 115 శాతం వృద్ధి చెందింది. ఈ వృద్ధి అంతర్జాతీయంగా 82 శాతంగా ఉంది. ఇక వచ్చే పదేళ్లలో ఆసియా పసిఫిక్ ప్రాంతపు సంపన్నుల సంఖ్య 50 శాతం వృద్ధితో 52 లక్షలకు చేరుతుందని అంచనా. ఇదే సమయంలో భారత్‌లో సంపన్నుల సంఖ్య 105 శాతం వృద్ధితో 2.36 లక్షల నుంచి 4.83 లక్షలకు చేరుతుందని పేర్కొంది.
 
తలసరి ఆదాయంలో దిగువన
తలసరి ఆదాయం ఆధారంగా చూస్తే.. భారత్‌లోని ఒక వ్యక్తి సగటు సంపద 3,500 డాలర్లుగా ఉంది. ఈ సంపద ఆస్ట్రేలియాలో అత్యధికంగా 2,04,000 డాలర్లుగా, పాకిస్తాన్‌లో అత్యల్పంగా 1,600 డాలర్లుగా ఉంది. భారత్‌లోని వ్యక్తిగత మొత్తం సంపద 4,365 బిలియన్ డాలర్లుగా ఉంటే, చైనాలోని వ్యక్తిగత మొత్తం సంపద అత్యధికంగా 17,254 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలోని అందరి ప్రజల వద్ద ఉన్న సంపదను మొత్తం వ్యక్తుల సంపదగా పరిగణిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement