ఆధార్‌తో రూ. 90వేల కోట్ల ఆదా..

India can save Rs 77,000 crore annually with Aadhaar - Sakshi

మిగులుతో మూడు భారీ పథకాలు అమలు చేయొచ్చు

ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడి

న్యూఢిల్లీ:  అర్హులైన లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాల సబ్సిడీలను అందించేందుకు తోడ్పడుతున్న ఆధార్‌తో గణనీయంగా ఆదా అవుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. నకిలీ లబ్ధిదారులు, అనర్హులను ఏరివేయడం ద్వారా గతేడాది మార్చి ఆఖరు దాకా చూస్తే సుమారు రూ. 90,000 కోట్లు ఆదా అయినట్లు ఆయన వివరించారు. ‘ఆధార్‌ ప్రయోజనాలు’ అంశంపై  సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌లో చేసిన ఒక పోస్టులో ఈ విషయాలు పేర్కొన్నారు.

ఆధార్‌ వినియోగం ద్వారా భారత్‌ ఏటా రూ. 77,000 కోట్లు ఆదా చేసుకోగలదంటూ ప్రపంచ బ్యాంకు ఒక నివేదికలో పేర్కొన్నట్లు ఆయన వివరించారు. ‘ఆధార్‌తో ఆదా అయ్యే నిధులతో ఆయుష్మాన్‌ భారత్‌ స్థాయిలో మూడు పథకాలను అమలు చేయొచ్చు’ అని జైట్లీ తెలిపారు. కుటుంబానికి ఏటా రూ. 5 లక్షల హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీనిచ్చే ఆయుష్మాన్‌ భారత్‌ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద.. దాదాపు 10.74 కోట్ల పైగా పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టినప్పట్నుంచి  ఇప్పటిదాకా 7 లక్షల మంది పేద పేషెంట్లు.. ఉచిత వైద్య చికిత్స పొందినట్లు   జైట్లీ పేర్కొన్నారు.  

122 కోట్ల ఆధార్‌ నంబర్ల జారీ..
2016లో ఆధార్‌ బిల్లును జారీ చేసినప్పట్నుంచీ 28 నెలల వ్యవధిలో 122 కోట్ల ఆధార్‌ నంబర్లను జారీ చేయడం జరిగిందని జైట్లీ తెలిపారు. 18 ఏళ్ల పైబడిన వయోజనుల్లో 99 శాతం మందికి ఆధార్‌ జారీ అయ్యిందని పేర్కొన్నారు. ‘ఆధార్‌ ఆధారంగా ఇప్పటిదాకా లబ్ధిదారులకు బదలాయించిన సబ్సిడీల విలువ దాదాపు రూ. 1,69,868 కోట్ల మేర ఉంటుంది. మధ్యవర్తుల ప్రమేయం తగ్గిపోవడం వల్ల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి చేరతాయి. ఇది భారత్‌లో మాత్రమే అమలవుతున్న ప్రత్యేక టెక్నాలజీ’ అని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top