మహమ్మారితో మహా సంక్షోభం : ఐఎంఎఫ్‌

IMF Chief Says World Faces Worst Economic Fallout  - Sakshi

న్యూయార్క్‌ : కరోనా మహమ్మారితో గడిచిన వందేళ్లలో కనివినీ ఎరుగని ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని, ఈ గండం​ నుంచి కోలుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగించాల్సి ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టలినా జార్జివ అన్నారు. 2020లో అంతర్జాతీయ వృద్ధి రేటు ప్రతికూలంగా మారుతుందని ఆమె హెచ్చరించారు. 180 సభ్యదేశాల్లో 170 దేశాలకు సంబంధించి తలసరి ఆదాయం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రేట్‌ డిప్రెషన్‌ తర్వాత ఇదే అతిపెద్ద ఆర్థిక విపత్తుగా భావిస్తున్నామని చెప్పారు. వచ్చే వారం ఐఎంఎఫ్‌, వరల్డ్‌ బ్యాంకుల సమావేశం జరగాల్సి ఉంది. 

మాంద్యంపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడినా వచ్చే ఏడాది స్వల్ప రికవరీ మాత్రమే ఉండొచ్చని అంచనా వేశారు. వైరస్‌ను కట్టడి చేసేందుకకు విధించిన లాక్‌డౌన్‌లు సడలించిన తర్వాత సాధారణ కార్యకలాపాలు పుంజుకునేందుకు సమయం పడుతుందని ఆమె విశ్లేషించారు. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి ఎప్పుడు తగ్గుముఖం పడుతుంది? ఎంత వ్యవధి తీసుకుంటుందన్న అంశాలపై అనిశ్చితి నెలకొందని చెప్పారు. 

చదవండి : ప్రపంచంపై కరోనా పడగ

మహమ్మారి ప్రభావాన్ని అధిగమించేందుకు పలు దేశాలు ఇప్పటికే 8 లక్షల కోట్ల డాలర్ల మేరకు ఉద్దీపన చర్యలు చేపట్టాయని గుర్తుచేశారు. అయినప్పటికీ దెబ్బతిన్న వ్యాపారాలు, వ్యక్తులను ఆదుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకునే ప్రక్రియకు అవరోధాలు తప్పడం లేదని, వాటిని అధిగమించడానికి మరింత సాయం చేయాలని  ఆమె ప్రభుత్వాలను కోరారు. ఈ సంక్షోభానికి సరిహద్దులు లేవని, అన్ని దేశాలు కరోనా మహమ్మారి బారిన పడ్డాయని జార్జివ చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top