మందగమనం తాత్కాలికమే.. 

IMF Chief Kristalina Georgieva Speaks Over Global Growth - Sakshi

భారత్‌ ఎకానమీపై ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టలినా జార్జీవా వ్యాఖ్య

ముగిసిన డబ్ల్యూఈఎఫ్‌ వార్షిక సదస్సు

దావోస్‌ (స్విట్జర్లాండ్‌): భారత్‌లో వృద్ధి మందగమనం తాత్కాలికమేనని, ఇకపై వృద్ధి పుంజుకుంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) చీఫ్‌ క్రిస్టలినా జార్జీవా అన్నారు. శుక్రవారం దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) 50వ వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 2019 అక్టోబర్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంచనాలు ప్రకటించినప్పటితో పోలిస్తే 2020 జనవరిలో మెరుగైన పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. అమెరికా–చైనా మధ్య తొలి దశ ఒప్పందంతో తగ్గుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, సమకాలిక పన్ను కోతలు తదితర అంశాలు సానుకూల పరిస్థితులకు దారితీసినట్టు చెప్పారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 3.3 శాతం వృద్ధి రేటు అన్నది అద్భుతమేమీ కాదన్నారు. ‘‘ఇప్పటికీ వృద్ధి నిదానంగానే ఉంది. అయితే పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరింత దూకుడైన ద్రవ్య విధానాలు అవసరం. నిర్మాణాత్మక సంస్కరణలు కావాలి. మరింత చైతన్యం కావాలి’’ అని జార్జీవా పేర్కొన్నారు. వర్ధమాన మార్కెట్లలో ఒక్క భారత మార్కెట్‌నే తాము డౌన్‌గ్రేడ్‌ చేశామని, అది కూడా తాత్కాలికమేనని చెప్పారు. రానున్న కాలంలో పరిస్థితులు మెరుగుపడతాయన్నారు.

వర్ధమాన దేశాల్లో ఇండోనేషియా, వియత్నాంను ఆశాకిరణాలుగా పేర్కొన్నారు. చాలా ఆఫ్రికా దేశాలు కూడా మంచి పనితీరు చూపిస్తున్నాయని, అదే సమయంలో మెక్సికో వంటి దేశాల పనితీరు ఆశావహంగా లేదన్నారు. తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం, దీర్ఘకాలంగా తయారీ వృద్ధి బలహీనంగా ఉండడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా ఆమె పేర్కొన్నారు.

ఎన్నో అంశాలపై ప్రగతి...
డబ్ల్యూఈఎఫ్‌ 50 వార్షిక సదస్సు విశేషమైనదిగా సంస్థ ప్రెసిడెంట్‌ బోర్గేబ్రెండే పేర్కొన్నారు. ఎన్నో అంశాలపై ప్రగతిని సాధించినట్టు చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ/ప్రైవేటు సహకారం అన్నది ఎంతో కీలకమైనదిగా అభివర్ణించారు. అంతర్జాతీయంగా సమ్మిళిత, స్థిరమైన వృద్ధి కోసం ఓఈసీడీతో కలసి పనిచేస్తామని ప్రకటించారు. 2030కి లక్ష కోట్ల చెట్ల సంరక్షణ, పెంపకం లక్ష్యానికి సహకరిస్తామని, నాలుగో పారిశ్రామిక విప్లవానికి వీలుగా పునఃనైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలను ప్రకటించారు.

టాటా స్టీల్‌కు డబ్ల్యూఈఎఫ్‌ గౌరవం 
గ్లోబల్‌ లైట్‌హౌస్‌ నెట్‌వర్క్‌లో చేరినందుకు టాటా స్టీల్‌ కళింగనగర్‌ను డబ్ల్యూఈఎఫ్‌ సత్కరించింది. టాటా స్టీల్‌ సీఈవో టీవీ నరేంద్రన్‌ అవార్డును అందుకున్నట్టు కంపెనీ తెలిపింది.

గోయల్‌ కీలక భేటీలు  
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ డబ్ల్యూఈఎఫ్‌ సదస్సు సందర్భంగా శుక్రవారం పలు కీలక నేతలతో చర్చలు జరిపారు. సమగ్రాభివృద్ధి, పారదర్శకత దిశగా సంస్కరణలకు భారత్‌ సిద్ధంగా ఉందని డబ్ల్యూటీవో చీఫ్‌ రాబర్టో అజవేదోతో చెప్పారు. ఈయూ వాణిజ్య కమిషనర్‌ ఫిల్‌ హోగన్, ప్రముఖ ఆర్థికవేత్త మేఖేల్‌ స్పెన్స్, బ్లాక్‌స్టోన్‌ గ్రూపు చైర్మన్‌  ష్వార్జ్‌మాన్, ఏబీబీ చైర్మన్‌ పీటర్‌ వోసర్‌ తదితరులతోనూ గోయల్‌ చర్చించారు.

ప్రపంచ వృద్ధి అంచనాలు సవరణ
సవరించిన ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను ఐఎంఎఫ్‌ తాజాగా విడుదల చేసింది. 2019 సంవత్సరానికి వృద్ధి రేటు 2.9 శాతానికి సవరించిం ది. 2020లో ఇది 3.3 శాతంగా ఉంటుందని పేర్కొంది. 2021లో 3.4 శాతానికి పెరుగు తుందని అంచనా వేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top