రెరాలో నమోదు కాకపోతే?

If not registered in the rera? - Sakshi

ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానా

తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ప్రారంభమైన నెల రోజులైంది. 2017, జనవరి 1 తర్వాత 5 వేల ప్రాజెక్ట్‌లు అనుమతి పొందితే.. రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు మాత్రం జస్ట్‌ 17. నవంబర్‌ 30వ తేదీలోపు ఆయా ప్రాజెక్ట్‌లు రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానా తప్పదు.

సాక్షి, హైదరాబాద్‌:  2017 జనవరి 1 తేదీ తర్వాత హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పంచాయతీలు, డీటీసీపీ, టీఎస్‌ఐఐసీల నుంచి అనుమతి పొందిన ప్రతి ఒక్క నివాస, వాణిజ్య సముదాయాలు రెరాలో నమోదు చేసుకోవాలి. ఆయా విభాగాల నుంచి 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్లుంటే ప్రతి ప్రాజెక్ట్‌ రెరా పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. తెలంగాణలో జనవరి 1, 2017 తర్వాత జీహెచ్‌ఎంసీ నుంచి 2,985 ప్రాజెక్ట్‌లు, హెచ్‌ఎండీఏ 840 ప్రాజెక్ట్‌లు, డీటీసీపీ నుంచి 1,122 ప్రాజెక్ట్‌లను అనుమతులు పొందాయి. ఈ ప్రాజెక్ట్‌లన్నీ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే.

3 దశల్లో రెరా రిజిస్ట్రేషన్‌..
ఇప్పటివరకు టీఎస్‌ రెరాలో 450 మంది డెవలపర్లు, 17 ప్రాజెక్ట్‌ల వివరాలు మాత్రమే నమోదయ్యాయి. రెరాలో నమోదు ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. తొలిదశలో నిర్మాణ సంస్థ ప్రమోటర్లు, డెవలపర్లు, ఏజెంట్లు నామమాత్రపు రుసుము చెల్లించి రెరాలో రిజిస్టర్‌ చేసుకోవాలి. రెండోదశలో ప్రాజెక్ట్‌ వివరాలను, డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెరా అధికారులు పర్యవేక్షణ, స్క్రూటినీ వంటివి నిర్వహించి.. అన్నీ సవ్యంగా ఉన్నాయని తేలితే చివరి దశలో రెరా నమోదు పత్రాన్ని అందజేస్తారు.

నమోదు చేయకుండా విక్రయిస్తే..
రెరాలో నమోదు చేయకుండా ఫ్లాట్, ప్లాట్‌ ఏదైనా సరే అడ్వర్‌టైజింగ్‌ చేయడం గానీ విక్రయించడం గానీ చేయకూడదు. కానీ, రెరా అమల్లోకి వచ్చి నెల రోజులు గడిస్తున్నా.. నేటికీ యథేచ్ఛగా ప్రకటనలు, ఆఫర్లూ ప్రకటిస్తున్నారని.. విక్రయాలూ జరుపుతున్నారని టీఎస్‌ రెరా అధికారి ఒకరు తెలిపారు. రెరాలో రిజిస్ట్రేషన్‌ చేయకుండా విక్రయించిన పక్షంలో ప్రాజెక్ట్‌ వ్యయంలో 10% జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది.

నమోదు రుసుములు..
ఒకసారి రిజిస్ట్రేషన్‌కు డెవలపర్లకైతే రూ.750, ఏజెంట్లకైతే రూ.500 ఉంటుంది. ప్రాజెక్ట్‌ను రిజిస్ట్రేషన్‌ చేశాక.. ప్రతి మూడు నెలలకొకసారి అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ధరలివే..
♦వెయ్యి చ.మీ. వరకుండే గ్రూప్‌ హౌజింగ్‌కు చ.మీ.కు రూ.5, అంతకంటే ఎక్కువైతే చ.మీ. రూ.10. గరిష్ట మొత్తం రూ.5 లక్షలు.
♦ రెసిడెన్షియల్‌ కమ్‌ కమర్షియల్‌ ప్రాజెక్ట్‌కు గరిష్ట మొత్తం రూ.7 లక్షలు.
♦ వెయ్యి చ.మీ. లోపుండే కమర్షియల్‌ ప్రాజెక్ట్‌కు చ.మీ.కు రూ.20, అంతకంటే ఎక్కువైతే చ.మీ.కు రూ.25. గరిష్ట మొత్తం రూ.10 లక్షలు.
♦ ఓపెన్‌ ప్లాట్లకు చ.మీ.కు రూ.5. గరిష్ట మొత్తం రూ.2లక్షలు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top