దిగొచ్చిన ఐసీఐసీఐ : కష్టాల్లో  చందా కొచర్‌ 

ICICI Bank begins probe against MD and CEO Chanda Kochhar - Sakshi

సాక్షి, ముంబై :  వీడియోకాన్‌-ఐసీఐసీ  స్కాంలో ఎట్టకేలకు ఐసీఐసీఐ బ్యాంకు దిగి వచ్చింది. ఈ కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టనున్నట్లు బుధవారం వెల్లడించింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా ఐసీఐసీఐ పేర్కొంది. రుణాల వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఎండీ చందా కొచర్‌పై ఆరోపణలను మొదట్లో కొట్టిపారేసిన బ్యాంకు,  తాజాగా వాటిపై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.  ఇందుకోసం ఏకసభ్య  కమిటీని నియమించింది. బ్యాంక్ నియమావళిని ఎలా ఉల్లంఘనలు, ఆమె తీసుకున్న నిర్ణయాలుబ్యాంకుపై ఎలాంటి  ప్రభావం చూపిందన్న కోణంలో విచారణ సాగుతుందని బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. 

బ్యాంక్ నియమావళిని ఉల్లంఘించిన కేసులో చందా కొచర్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ విచారించనున్నది. దీని కోసం బ్యాంక్ బోర్డు.. ప్రత్యేక ప్యానల్‌ను ఏర్పాటు చేసింది. వీడియోకాన్‌ సంస్థకు రూ. 3,800 కోట్ల రుణ వ్యవహారంలో చందాకొచ్చర్‌ సాయం చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 2012లో వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ ఈ రుణం ఇచ్చింది. వీడియోకాన్‌ గ్రూప్‌కు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌, చందాకొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌, మరో ఇద్దరు బంధవులు కలిసి 2008లో ఒక కంపెనీ ఏర్పాటు చేశారు.

వీడియోకాన్‌కిచ్చిన వేలకోట్ల రుణం 2017నాటికి మొండి బకాయిగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా క్విడ్‌ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్‌ గ్రూప్‌కు కొచర్‌ రుణాలిచ్చేందుకు తోడ్పాటు అందించారని, ఫలితంగా ఆమె కుటుంబీకులు లబ్ధి పొందారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే ఇందులో చందాకొచర్‌ ప్రమేయం ఏమీ లేదని అప్పట్లో ఐసీఐసీఐ బోర్డు తీవ్రంగా ఖండించింది.  ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని, చందాకొచ్చర్‌పై తమకు పూర్తి విశ్వాసం ఉందని  గట్టిగా వాదించడం, ఈ విషయంలో ఐసీఐసీఐ బోర్డులో కూడా విభేదాలొచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారంలో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. చందాకొచర్ భర్త దీపక్‌, వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌లను అనుమానితులుగా చేర్చింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top