హెచ్‌యూఎల్‌ లాభం 1,529 కోట్లు

Hindustan Unilever Q1 net profit rises 19% to Rs 1529 crore - Sakshi

క్యూ1లో 19 శాతం వృద్ధి...

రూ.9,622 కోట్లకు మొత్తం ఆదాయం

ఇంట్రాడేలో ఆల్‌ టైమ్‌ హైకి షేరు

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ (హెచ్‌యూఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి రూ.1,529 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.1,283 కోట్లతో పోలిస్తే 19 శాతం వృద్ధి సాధించామని హిందుస్తాన్‌ యూనిలీవర్‌ తెలిపింది.

అమ్మకాలు మంచి వృద్ధిని సాధించడం, నిర్వహణ పనితీరు బాగుండటం వల్ల ఈ స్థాయిలో నికర లాభం సాధించినట్లు కంపెనీ సీఎమ్‌డీ సంజీవ్‌ మెహతా తెలిపారు. మొత్తం ఆదాయం రూ.9,335 కోట్ల నుంచి 3 శాతం వృద్ధితో రూ.9,622 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం రూ.1,866 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.2,251 కోట్లకు చేరుకుంది. మార్జిన్‌ 1.8 శాతం పెరిగి 23.73 శాతానికి ఎగసింది.  

అంచనాలను మించిన లాభం  
కంపెనీ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ క్వార్టర్లో రూ.1,525 కోట్ల నికర లాభం సాధించగలదని, నిర్వహణ లాభం రూ.2,192 కోట్లుగా, నిర్వహణ లాభ మార్జిన్‌ 22.9% ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. లాభం, నిర్వహణ లాభం, లాభ మార్జిన్‌లు అంచనాలను మించగా, ఆదాయం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.  

‘చమురు’ ప్రభావం: సమీప భవిష్యత్తులో డిమాండ్‌ మెల్లమెల్లగా పుంజుకోగలదనే ఆశాభావాన్ని సంజీవ్‌ మెహతా వ్యక్తం చేశారు. కొత్త ఉత్పత్తులు, మార్కెట్‌ను మరింతగా అభివృద్ధి చేసుకునే అంశాలపై దృష్టిని కొనసాగిస్తామన్నారు. ‘‘ముడి చమురు ధరల్లో ఒడిదుడుకులు, కరెన్సీ ఆధారిత ద్రవ్యోల్బణ సమస్యలు తీవ్రంగానే ప్రభావం చూపిస్తాయనేది మా అంచనా. నిర్వహణ సామర్థ్యం మరింతగా మెరుగుపరచుకోవడం ద్వారా ఈ సమస్యలను సమర్థంగా ఎదుర్కోగలం.

నిలకడైన, లాభదాయకమైన, బాధ్యతాయుతమైన వృద్ధిని సాధించడమే మా లక్ష్యం. ఈ క్యూ1లో ఆహార పదార్థాలు, రిఫ్రెష్‌మెంట్‌ విభాగాలను విలీనం చేశాం’’ అని మెహతా వివరించారు.  హోమ్‌ కేర్‌ వ్యాపారం 3% వృద్ధితో రూ.3,146 కోట్లకు, నిర్వహణ లాభం 34 శాతం వృద్ధితో రూ.602 కోట్లకు పెరిగాయని చెప్పారాయన. ‘‘అలాగే బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ సెగ్మెంట్‌ 0.9 శాతం వృద్ధితో రూ.4,407 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 7.7 శాతం వృద్ధి చెందింది. ఫుడ్స్‌ అండ్‌ రిఫ్రెష్‌మెంట్‌ వ్యాపారం 8 శాతం వృద్ధితో రూ.1,785 కోట్లకు చేరుకుంది’’ అని వివరించారు.  

ఈ ఏడాది 30 శాతం పెరిగిన షేర్‌..
హెచ్‌యూఎల్‌ ఫలితాలు సోమవారం మార్కెట్‌ ముగిశాక వెలువడ్డాయి. ఫలితాలు బాగుంటాయనే అంచనాలతో ఈ షేర్‌ బీఎస్‌ఈ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,779 ను తాకింది. చివరకు 0.7 శాతం లాభంతో రూ.1,754 వద్ద ముగిసింది. గత ఏడాది 65 శాతం లాభపడిన ఈ షేర్‌ ఈ ఏడాది ఇప్పటికే 30 శాతం వరకూ పెరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top