పరిశ్రమకంటే ముందుంటాం | Hero MotoCorp South Head Mahesh | Sakshi
Sakshi News home page

పరిశ్రమకంటే ముందుంటాం

Jul 16 2015 11:55 PM | Updated on Sep 3 2017 5:37 AM

పరిశ్రమకంటే ముందుంటాం

పరిశ్రమకంటే ముందుంటాం

ద్విచక్ర వాహన పరిశ్రమ ఈ ఏడాది 8-10 శాతం వృద్ధి ఆశిస్తోందని హీరో మోటోకార్ప్ తెలిపింది.

హీరో మోటోకార్ప్ సౌత్ హెడ్ మహేశ్
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ద్విచక్ర వాహన పరిశ్రమ ఈ ఏడాది 8-10 శాతం వృద్ధి ఆశిస్తోందని హీరో మోటోకార్ప్ తెలిపింది. పరిశ్రమకంటే మెరుగైన ఫలితాలను నమోదు చేస్తామని కంపెనీ సౌత్ జోనల్ హెడ్ మహేశ్ హీరేమత్ వెల్లడించారు. కొత్త ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్, ప్యాషన్ ప్రో మోడళ్లను గురువారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా హీరో మోటోకార్ప్ బ్రాండ్ అంబాసిడర్ అల్లు అర్జున్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం భారత్‌లో 18 మోడళ్లను విక్రయిస్తున్నట్టు చెప్పారు. మరిన్ని మోడళ్లు ఈ ఏడాది రానున్నాయని వివరించారు. 50 శాతం మార్కెట్ వాటాతో దేశంలో అగ్రస్థానంలో ఉన్నట్టు తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నెలకు 90-95 వేల ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఇందులో సగం వాటా హీరోదేనని వివరించారు. రెండు రాష్ట్రాల్లో 600 టచ్ పాయింట్లు ఉన్నాయని, ఈ ఏడాది మరో 60 కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 6 శాతం వృద్ధితో 2014-15లో కంపెనీ మొత్తం 66 లక్షల వాహనాలను విక్రయించింది.

 ప్రభుత్వం చేతుల్లోనే : దక్షిణాదిన 18 లక్షల వాహనాల తయారీ సామర్థ్యంతో 6వ ప్లాంటును నెలకొల్పాలనుకున్న హీరో మోటోకార్ప్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలో హీరోకు ఏపీఐఐసీ గతేడాది స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ స్థలం తమ కంపెనీకి చెందినదని తమిళనాడుకు చెందిన ఐశ్వర్య ఆర్చర్డ్స్ హైకోర్టును ఆశ్రయించింది. స్థల సేకరణ, నష్ట పరిహారం చెల్లింపు, పునరావాసం విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించలేదని హైకోర్టుకు విన్నవించింది.

స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాద ని, యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఏపీఐఐసీ తమకు స్థలాన్ని కేటాయించిందని, ప్రభుత్వమే ఈ వివాదాన్ని పరిష్కరిస్తుందని హీరో మోటోకార్ప్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, ఉత్తరాదిన కంపెనీకి ఇప్పటికే మూడు ప్లాంట్లున్నాయి. ఉత్తరాదినే మరో రెండు, భారత్ వెలుపల రెండు ప్లాంట్లు నిర్మిస్తోంది. భారత్‌లోని ప్లాంట్ల ప్రస్తుత సామర్థ్యం 90 లక్షల యూనిట్లు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement