దేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కీలక అడుగు వేస్తోంది. సంస్థ తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోటార్‌సైకిల్‌ను జూన్ 3న భారత మార్కెట్లో ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి హాజరుకానున్నారు.
ఏమిటీ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు?
ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు పెట్రోల్‌తో పాటు ఇథనాల్ మిశ్రమ ఇంధనాలపై కూడా నడుస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో E20 ఇంధనం వినియోగంలో ఉండగా, భవిష్యత్తులో E85 నుంచి E100 వరకు ఉన్న అధిక ఇథనాల్ మిశ్రమాలకు అనుకూలమైన వాహనాలను ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
హీరో మోటోకార్ప్ విడుదల చేయనున్న మోడల్ పేరు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బైక్ సంస్థకు అత్యంత ప్రజాదరణ పొందిన స్ప్లెండర్ లేదా హెచ్‌ఎఫ్ డీలక్స్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడే అవకాశం ఉంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో హీరో ప్రదర్శించిన ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్ కూడా హెచ్‌ఎఫ్ డీలక్స్ ఆధారంగానే ఉండటం గమనార్హం.
ఇప్పటికే భారత మార్కెట్లో కొన్ని ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా జిక్సర్ ఎస్‌ఎఫ్ 250 ఫ్లెక్స్-ఫ్యూయల్ వెర్షన్‌ను విక్రయిస్తోంది. హోండా కూడా సీబీ300ఎఫ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. మరోవైపు ఫోర్ వీలర్ విభాగంలో మారుతి సుజుకి కూడా త్వరలోనే తన తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ మోడల్ వ్యాగన్ ఆర్ ఆధారంగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేశంలో గ్రీన్ మొబిలిటీ వైపు మార్పు వేగవంతమవుతున్న తరుణంలో హీరో మోటోకార్ప్ కొత్త అడుగు ద్విచక్ర వాహన రంగంలో కొత్త దిశను చూపనుందని భావిస్తున్నారు.


