హెచ్‌డీఎఫ్‌సీ రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఫండ్‌ అన్ని కాలాల్లోనూ స్థిరమైన రాబడి! | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఫండ్‌ అన్ని కాలాల్లోనూ స్థిరమైన రాబడి!

Published Mon, Mar 12 2018 12:13 AM

HDFC Regular Savings Fund - Sakshi

స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు దీర్ఘకాలం కోసం ఉద్దేశించినవని సాధారణంగా చెప్పుకుంటాం. స్వల్పకాలంలో అస్థిరతల కారణంగా నష్టాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక. కొందరు ఈ విధమైన రిస్క్‌ తీసుకునేందుకు సుముఖంగా ఉండరు. కొందరు స్వల్పకాలం కోసమే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటుంటారు. ఈ తరహా వ్యక్తులు డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను పరిశీలించొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఫండ్‌ కూడా ఇదే కోవకు చెందుతుంది. 2–3 ఏళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.


ఆర్‌బీఐ చాలా నెలలుగా కీలక రేట్లలో ఏ విధమైన మార్పులు చేయడం లేదు. ఇంత కాలం క్రమంగా తగ్గుతూ వచ్చిన రేట్లు ఆర్‌బీఐ మారిన విధానంతో అక్కడే ఆగిపోయాయి. త్వరలోనే కీలక రేట్లు పెరిగేందుకు ఇది సంకేతమని విశ్లేషకుల అంచనా. బాండ్‌ మార్కెట్‌ దీన్ని ఇప్పటికే పరిగణనలోకి తీసుకుంది.

వడ్డీరేట్ల పరంగా రిస్క్‌ తీసుకోని ఇన్వెస్టర్లకు హెచ్‌డీఎఫ్‌సీ రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఫండ్‌ తరహా షార్ట్‌ టర్మ్‌ ఇన్‌కమ్‌ ఫండ్స్‌ ఈ దశలో అనువైనవి. ఇవి 3–4 ఏళ్లలో కాల వ్యవధి ముగిసే డెట్‌ సెక్యూరిటీల్లో ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్‌ చేస్తాయి. దీర్ఘకాలిక సాధనాలకు స్వల్ప మొత్తం, మధ్య కాలిక సాధనాలకు కూడా అధిక నిధులు కేటాయిస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఫండ్‌ ఈ తరహా పథకమే. అన్నిరకాల రేట్లలోనూ స్థిరమైన రాబడులను అందిస్తోంది.

రాబడులు
2002లో ఈ పథకం మొదలు కాగా, ఏటా 8 శాతం చొప్పున రాబడులను అందించిన చరిత్ర ఉంది. 16ఏళ్ల కాలంలో స్థిరమైన, ఈ విభాగంలో మెరుగైన లాభాలను అందిస్తున్న పథకంగా హెచ్‌డీఎఫ్‌సీ రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఫండ్‌ను చెప్పుకోవచ్చు. ఐదు, ఏడు, పదేళ్ల రాబడులు 8.8 – 8.9 శాతం మధ్య ఉండడం ఈ విభాగంలో మెరుగైన పనితీరుకు నిదర్శనం. వడ్డీ రేట్ల పరంగా రిస్క్‌ ఉండని షార్ట్‌ టర్మ్‌ బాండ్లలో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేయడం స్థిరమైన రాబడులకు సాయపడుతోంది.

మార్కెట్లు నిరుత్సాహంగా ఉన్న 2012, 2015లోనూ ఈ పథకం 7–9 శాతం మధ్యలో రాబడులను ఇవ్వడం విశేషం. స్వల్ప కాలంలో మార్కెట్లు అస్థిరంగా ఉంటే బాండ్లు లబ్ది పొందుతాయి. వడ్డీ రేట్ల క్షీణ దశలో మాత్రం వీటి రాబడులు పడిపోతాయి. 2014, 2016 ర్యాలీల్లో షార్ట్‌ టర్మ్‌ బాండ్ల రాబడులు తగ్గితే, దీర్ఘకాలిక గిల్ట్‌ ఫండ్స్‌ 16–17 శాతం స్థాయిలో అదిరిపోయే రాబడులను ఇచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఫండ్‌ మాత్రం 10–11 శాతం రాబడులను అందించింది. ప్రస్తుతం వడ్డీ రేట్ల పరంగా అనిశ్చితి నెలకొని ఉంది. ఈ సమయంలో స్వల్పకాల బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసే ఈ పథకం ఆకర్షణీయమైనదే.

పెట్టుబడులు
ప్రస్తుతం సగటున 1.8 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన బాండ్లలో ఈ పథకం పెట్టుబడులు ఉన్నాయి. ఏఏఏ రేటెట్‌ బాండ్లలో 27 శాతం ఇన్వెస్ట్‌ చేసింది. ఏఏ రేటెడ్‌ బాండ్లలో 54 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఏ రేటెడ్‌ డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లో 12 శాతం పెట్టుబడులు ఉన్నాయి. జనవరి 31నాటి పెట్టుబడుల విలువ రూ.5,433 కోట్లు.  


ఎందులో ఎంతెంత..?
సాధనం          పెట్టుబడుల శాతం
ఏఏ+, తక్కువ
రేటింగ్‌ ఉన్నవి          66.5
ఏఏఏ రేటెడ్‌ బాండ్లు    27.4
నగదు                     4.3
సావరీన్‌                   1.4

Advertisement
Advertisement