హెచ్‌సీఎల్‌ టెక్‌.. Q1 ఓకే- షేరు అప్‌

HCL Technologies Q1 results- share up - Sakshi

మార్కెట్ల ప్రారంభంలో ఫలితాల విడుదల

నికర లాభం రూ. 2925 కోట్లు

ఆదాయం రూ. 17,481 కోట్లు

గత 3 నెలల్లో షేరు 36 శాతం ర్యాలీ 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అంచనాలకు అనుగుణమైన ఫలితాలు ప్రకటించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో హెచ్‌సీఎల్‌ టెక్‌ రూ. 2925 కోట్ల నికర లాభం ఆర్జించింది. త్రైమాసిక ప్రాతిపదికన ఇది 7.3 శాతం తక్కువకాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో రూ. 3154 కోట్ల లాభం నమోదైంది. ఇక మొత్తం ఆదాయం సైతం 4 శాతం క్షీణించి రూ. 17,481 కోట్లను తాకింది. గత(2019-20) క్యూ4లో రూ. 18,590 కోట్ల ఆదాయం సాధించింది. డాలర్ల రూపేణా ఆదాయం 7.4 శాతం నీరసించి 2356 మిలియన్లకు చేరింది. అంతక్రితం 2543 మిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదైంది.

గైడెన్స్‌ ఇలా
రానున్న మూడు క్వార్టర్లలో డాలర్ల ఆదాయం 1.5-2.5 శాతం మధ్య పుంజుకోగలదని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ అంచనా వేస్తోంది.  నిర్వహణ లాభ మార్జిన్లు 19.5-20.5 శాతం స్థాయిలో నమోదుకాగలవని భావిస్తోంది. కాగా.. ఈ క్యూ1లో హెచ్‌సీఎల్‌ టెక్‌ నిర్వహణ లాభం(ఇబిట్‌) 5.7 శాతం వెనకడుగుతో రూ. 3660 కోట్లను తాకింది. ఇబిట్‌  మార్జిన్లు 20.8 శాతం నుంచి 20.5 శాతానికి నామమాత్రంగా బలహీనపడ్డాయి. ఈ కాలంలో 11 కొత్త ట్రాన్స్‌ఫార్మేషనల్‌ డీల్స్‌ను కుదుర్చుకున్నట్లు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలియజేసింది. పలు విభాగాలలో  డిమాండ్‌ కనిపిస్తున్నదని, డీల్‌ పైప్‌లైన్‌ రీత్యా ఈ ఏడాది సైతం పటిష్ట ఫలితాలు సాధించే వీలున్నట్లు యాజమాన్యం అంచనా వేస్తోంది. కోవిడ్‌-19 నేపథ్యంలో తలెత్తిన అనిశ్చిత పరిస్థితులు కొంతమేర ఆదాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు ఫలితాల విడుదల సందర్భంగా తెలియజేసింది. 

36 శాతం ప్లస్‌
ఫలితాల నేపథ్యంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 1.3 శాతం పుంజుకుని రూ. 636 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 640 వరకూ ఎగసింది. ఫలితాల విడుదలకు ముందురోజు అంటే గురువారం ఈ షేరు రూ. 652 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకడం గమనార్హం! ఈ ఏడాది మార్చి 19న రూ. 376 దిగువన  52 వారాల కనిష్టాన్ని చవిచూసింది. గత మూడు నెలల్లో ఈ షేరు 36 శాతం ర్యాలీ చేయడం విశేషం!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top