
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశీయంగా రెండో అతి పెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం (స్టాండెలోన్) రూ. 12,768 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 11,059 కోట్లతో పోలిస్తే సుమారు 15 శాతం పెరిగింది. ఇది సుమారు రూ. 11,747 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 10.6 శాతం పెరిగి రూ. 19,553 కోట్ల నుంచి రూ. 21,635 కోట్లకు చేరింది. ఇది సుమారు రూ. 20,923 కోట్లుగా ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి.
ట్రెజరీ కార్యకలాపాలు మినహా, ఇతరత్రా ఆదాయం 13.7 శాతం పెరిగి రూ. 7,264 కోట్లకు ఎగిసింది. మరోవైపు, కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 15.9 శాతం వృద్ధితో రూ. 13,558 కోట్లకు చేరింది. క్రితం క్యూ1లో ఇది రూ. 11,696 కోట్లు. మొత్తం వడ్డీ ఆదాయం రూ. 38,996 కోట్ల నుంచి రూ. 42,947 కోట్లకు చేరింది. అసెట్స్ రూ.24,07,395 కోట్ల నుంచి రూ. 26,68,636 లక్షల కోట్లకు చేరాయి.
తగ్గిన ఎన్‌పీఏలు..
సమీక్షాకాలంలో బ్యాంక్ అసెట్ నాణ్యత మెరుగుపడింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (జీఎన్‌పీఏ) 2.15 శాతం నుంచి 1.67 శాతానికి దిగి వచి్చంది. నికర ఎన్‌పీఏ నిష్పత్తి 0.43 శాతం నుంచి 0.41 శాతానికి గ్గింది. నికర వడ్డీ మార్జిన్ 4.41 శాతం నుంచి 4.34 శాతానికి తగ్గింది. అయితే, ప్రొవిజనింగ్ భారీగా పెరిగింది. మార్చి త్రైమాసికంలో రూ. 1,332 కోట్లుగా ఉన్న ప్రొవిజనింగ్ రూ. 1,815 కోట్లకు ఎగిసింది. బ్యాంక్ షేరు ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 11 శాతం పెరిగి, దాదాపు రూ. 1,427 వద్ద ఉంది.
డిపాజిట్లు 12.8% అప్
సమీక్షా కాలం ఆఖరు నాటికి డిపాజిట్లు 12.8 శాతం పెరిగి రూ. 16,08,517 కోట్లకు చేరాయి. కాసా (కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్) నిష్పత్తి 38.7 శాతంగా ఉంది. కరెంట్ అకౌంట్ డిపాజిట్లు 11.2 శాతం, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు 7.6 శాతం పెరిగాయి.
దేశీయంగా రుణాల పోర్ట్‌ఫోలియో 12 శాతం పెరిగి రూ. 13,31,196 కోట్లకు చేరింది.
నికర వడ్డీ మార్జిన్ 4.36 శాతం నుంచి 4.34 శాతానికి నెమ్మదించింది. వడ్డీయేతర ఆదాయం (ట్రెజరీ మినహాయించి) 13.7 శాతం వృద్ధితో రూ. 6,389 కోట్ల నుంచి రూ. 7,264 కోట్లకు చేరింది.
ఫీజు ఆదాయం వార్షికంగా రూ. 5,490 కోట్ల నుంచి 7.5 శాతం వృద్ధితో రూ.5,900 కోట్లకు పెరిగింది.
రిటైల్ రుణాలు వార్షికంగా 6.9 శాతం పెరిగాయి. మొత్తం లోన్ పోర్ట్‌ఫోలియోలో వీటి వాటా 52.2 శాతంగా ఉంది. కార్పొరేట్ పోర్ట్‌ఫోలియో 7.5 శాతం పెరిగింది.
క్యూ1లో బ్యాంక్ కొత్తగా 83 శాఖలు ప్రారంభించింది. దీంతో మొత్తం శాఖల సంఖ్య 7,066కి, ఏటీఎంలు, క్యాష్ రీసైక్లింగ్ మెషిన్ల సంఖ్య 13,376కి చేరుకుంది.