దివాలా చట్టం’పై ఎస్సార్‌ స్టీల్‌కు చుక్కెదురు

దివాలా చట్టం’పై ఎస్సార్‌ స్టీల్‌కు చుక్కెదురు


చర్యలు నిలిపివేయాలన్న అభ్యర్థనకు కోర్టు నో  

అహ్మదాబాద్‌: దివాలా చట్టం కింద చర్యలు నిలిపివేయాలంటూ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన ఉక్కు తయారీ సంస్థ ఎస్సార్‌ స్టీల్‌కు చుక్కెదురైంది. కంపెనీ అభ్యర్థనను న్యాయస్థానం కొట్టేసింది. ఎస్సార్‌ స్టీల్‌ రుణభారం రూ.42,000 కోట్ల పైచిలుకు ఉంటుంది. ఇలా మొండిబాకీల భారం పెరిగిపోయిన 12 కంపెనీలపై ఆర్‌బీఐ సూచనల మేరకు బ్యాంకులు దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్‌బీఐ ఆదేశాలను సవాలు చేస్తూ ఎస్సార్‌ స్టీల్‌.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మిగతా మొండి బాకీల కంపెనీల తరహాలో తమ సంస్థను కూడా జమ కట్టరాదని కంపెనీ పేర్కొంది.రూ. 20,000 కోట్ల వార్షిక టర్నోవర్‌తో తమ కంపెనీ ఇంకా పనిచేస్తూనే ఉందని, రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలు తుది దశలో ఉన్న తరుణంలో ఇలాంటి చర్యలు సరికాదని వాదించింది. ఆర్‌బీఐ గానీ సర్క్యులర్‌ జారీ చేయకపోయి ఉంటే ఎస్‌బీఐ కన్సార్షియం తమపై దివాలా చర్యలకు ఉపక్రమించేది కాదని తెలిపింది. మరోవైపు, ఎస్సార్‌ స్టీల్‌ వాస్తవాలను తొక్కిపెట్టి కోర్టును పక్కదోవ పట్టిస్తోందంటూ ఆర్‌బీఐ తరఫు న్యాయవాది డేరియస్‌ ఖంబాటా వాదించారు. ఎస్సార్‌ స్టీల్‌ ఒక దశలో తమ కేసును నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు (ఎన్‌సీఎల్‌టీ) పంపే విషయంలో సుముఖత వ్యక్తం చేసిందని, కానీ ఆ విషయాన్ని మాత్రం తమ పిటిషన్‌లో ప్రస్తావించలేదని పేర్కొన్నారు. ఒకవేళ సదరు అంశం వెల్లడించి ఉంటే న్యాయస్థానం పిటిషన్‌ను ముందుగానే కొట్టిపారేసి ఉండేదని వివరించారు.మరికాస్త సమయం ఇచ్చి ఉండాల్సింది..

పిటిషన్‌ కొట్టివేత దరిమిలా.. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికను పూర్తి చేసేందుకు తమకు మరికాస్త సమయం ఇచ్చి ఉండాల్సిందని ఎస్సార్‌ స్టీల్‌ వ్యాఖ్యానించింది. ఈ దశలో దివాలా చర్యలు చేపడితే.. కంపెనీ కార్యకలాపాలు మరింతగా దెబ్బతింటాయని, మొండిబాకీ సమస్యకు పరిష్కారం ఇంకా జటిలం కాగలదని ఆందోళన వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, ఎన్‌సీఎల్‌టీ ముందు తమ వాదనలు వినిపిస్తామని ఎస్సార్‌ స్టీల్‌ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top