బ్యాంకులకు 3,800 కోట్ల ‘డిజిటల్‌’ దెబ్బ! | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు 3,800 కోట్ల ‘డిజిటల్‌’ దెబ్బ!

Published Fri, Sep 29 2017 12:46 AM

Govt's digital payments push making banks suffer

ముంబై: కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహిస్తుండటంతో ఆ ప్రభావం బ్యాంకులపై ప్రతికూలంగా పడుతోంది. పీవోఎస్‌ మెషీన్ల ద్వారా జరిగే ఆన్‌లైన్‌ కార్డ్‌ పేమెంట్స్‌ వల్ల బ్యాంకులకు వార్షికంగా రూ.3,800 కోట్లు నష్టం రావొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ను ప్రోత్సహించడానికి పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) మెషిన్లను ఏర్పాటు చేయాలని సూచించింది. దీంతో బ్యాంకులు పీవోఎస్‌ టర్మినల్స్‌ సంఖ్యను రెట్టింపు చేశాయి.

2016 మార్చిలో 13.8 లక్షలుగా ఉన్న పీవోఎస్‌ మెషీన్ల సంఖ్య 2017 జూలై నాటికి 28.4 లక్షలకు పెరిగింది. బ్యాంకులు సగటున రోజుకు 5,000 పీవోఎస్‌ మెషీన్ల చొప్పున ఏర్పాటు చేశాయి. దీంతో డెబిట్‌ ప్లస్‌ క్రెడిట్‌ కార్డుల లావాదేవీలు బాగా పెరిగాయి. పీవోఎస్‌ల వద్ద జరిగే ‘ఆఫ్‌– అజ్‌’ కార్డు లావాదేవీల విషయంలో వార్షికంగా రూ.4,700 కోట్లు నష్టం రావొచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్‌ అంచనా వేసింది. అదే పీవోఎస్‌ల వద్ద జరిగే ‘ఆన్‌–అజ్‌’ కార్డు ట్రాన్సాక్షన్ల ఆదాయం రూ.900 కోట్లుగా ఉండొచ్చని తెలిపింది. దీనివల్ల బ్యాంకులకు వార్షికంగా నికరంగా రూ.3,800 కోట్లు నష్టం వాటిల్లవచ్చని పేర్కొంది.

డెబిట్‌ కార్డు లావాదేవీలపై ఎండీఆర్‌ (మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు)1 శాతంగా, క్రెడిట్‌ కార్డుల లావాదేవీలపై వేర్వేరుగా ఉంటుంది. ఎండీఆర్, కార్డును తక్కువగా వినియోగించడం, నాణ్యతలేని టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వ్యాపారులకు రాయితీలు అందించకపోవడం, నగదు వాడకం వల్ల అయ్యే వ్యయంపై అవగాహన లేకపోవడం వంటి పలు అంశాలు కార్డు బిజినెస్‌ను ప్రభావితం చేస్తాయని నివేదిక పేర్కొంది. డిజిటల్‌ పేమెంట్స్‌ ప్రోత్సహించడానికి నాణ్యమైన టెలికం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అవసరమని తెలిపింది. అలాగే ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్లకు ప్రత్యేకమైన స్పెక్ట్రమ్‌ అవసరమని అభిప్రాయపడింది.  

Advertisement
Advertisement