బ్యాంకులకు బెయిలవుట్‌ జోష్‌

Government May Infuse Rs 11000 Crore In Five State-Run Banks - Sakshi

5 ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరో రూ.11వేల కోట్లు

అదనపు మూలధన ప్రణాళికకు ఆర్థిక శాఖ ఆమోదం

లిస్టులో అలహాబాద్, ఆంధ్రా బ్యాంక్‌ తదితరాలు

పీఎన్‌బీకి అత్యధికంగా రూ.2,816 కోట్లు  

న్యూఢిల్లీ: మొండిబాకీల(ఎన్‌పీఏ) దెబ్బకి మూలధన సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) ఆదుకునేందుకు ఉద్దేశించిన బెయిలవుట్‌ ప్యాకేజీ కింద కేంద్రం మరికొన్ని నిధులను సమకూర్చనుంది. ఇందులో భాగంగా అయిదు పీఎస్‌బీలకు రూ.11,336 కోట్లు అందించే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రా బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), కార్పొరేషన్‌ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌(ఐఓబీ), అలహాబాద్‌ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19)లో అదనపు మూలధనాన్ని సమకూర్చడానికి సంబంధించి ఇదే తొలి విడత కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ. 53,664 కోట్లు కూడా పీఎస్‌బీలకు కేంద్రం అందించనుంది. తాజా ప్రణాళిక ప్రకారం.. నీరవ్‌ మోదీ స్కామ్‌ బాధిత పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 2,816 కోట్లు లభించనున్నాయి. ఆంధ్రా బ్యాంక్‌కు రూ. 2,019 కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు రూ. 2,157 కోట్లు, కార్పొరేషన్‌ బ్యాంక్‌కు రూ. 2,555 కోట్లు, అలహాబాద్‌ బ్యాంక్‌కు రూ. 1,790 కోట్లు లభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.  

బాండ్లపై వడ్డీల చెల్లింపులకు తోడ్పాటు..
అదనపు టయర్‌ 1 (ఏటీ–1) బాండ్‌హోల్డర్లకు వడ్డీ చెల్లింపులు జరపాల్సి ఉండటంతో... ఈ జాబితాలోని కొన్ని బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. తాజా పరిణామం వీటికి కొంత ఉపశమనం ఇవ్వనుంది. సాధారణంగా శాశ్వత ప్రాతిపదికన ఉండే ఏటీ1 బాండ్ల ద్వారా కూడా బ్యాంకులు తమకు కావాల్సిన మూలధనాన్ని సమీకరిస్తుంటాయి. అయితే, కొన్నాళ్లుగా మొండిబాకీలు పెరిగిపోతుండటంతో పాటు భారీ నష్టాలు చవిచూస్తున్న పీఎస్‌బీలకు.. తమ సొంత ఆదాయం నుంచి ఈ బాండ్లపై వడ్డీలు చెల్లించడం కష్టంగా మారింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ విషయమే తీసుకుంటే.. గతేడాది జూలైలో ఏటీ1 బాండ్ల విక్రయం ద్వారా సమీకరించిన రూ.1,500 కోట్ల మొత్తంపై వడ్డీ చెల్లించేందుకు తక్షణం రూ.135 కోట్లు అవసరముంది. 8.98 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ నెల 25లోగా వడ్డీలు చెల్లించాల్సి ఉంది. అయితే, నీరవ్‌ మోదీ స్కామ్‌ దెబ్బకి లాభాలు తుడిచిపెట్టుకుపోగా భారీ నష్టాలు, మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎన్‌బీకి ఈ చెల్లింపులు జరపడం కష్ట సాధ్యంగా మారింది.

మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం పీఎన్‌బీ టయర్‌ 1 మూలధనం 5.96 శాతం స్థాయిలో ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్దేశించిన 7.375 శాతం కన్నా ఇది చాలా తక్కువ. జూలై 25 గడువులోగా నిర్దేశిత స్థాయికి మూలధనం పెంచుకుంటేనే పీఎన్‌బీ ఈ చెల్లింపులు చేయగలుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ రంగ బ్యాంకులు బాండ్లకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోతే.. దేశ ఆర్థిక వ్యవస్థపై, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలున్నాయని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఇటీవలే ఒక నివేదికలో  హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అదనపు మూలధన నిధులు సమకూర్చనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.  

రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు..
రెండు ఆర్థిక సంవత్సరాల్లో పీఎన్‌బీలకు  రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం రూ.1.35 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల రూపంలో పీఎస్‌బీలకు లభించనున్నాయి.

మిగతా రూ. 58,000 కోట్లను బ్యాంకులు మార్కెట్‌ నుంచి సమీకరించుకోవచ్చు. రూ.1.35 లక్షల కోట్లలో కేంద్రం ఇప్పటికే రూ.71,000 కోట్లు అందించింది. మిగతా మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూర్చనుంది. పీఎస్‌బీలు కూడా సొంతంగా రూ. 50,000 కోట్లను సమకూర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. మొత్తం 21 పీఎస్‌బీల్లో ఇప్పటికే 13 బ్యాంకులు ఇందుకోసం బోర్డులు, షేర్‌హోల్డర్ల అనుమతులు కూడా పొందాయి.

పీఎస్‌బీల షేర్లు రయ్‌..
కేంద్రం అదనపు మూలధనం సమకూర్చనున్న వార్తలతో మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకుపోయాయి. 11 శాతం దాకా పెరిగాయి. కార్పొరేషన్‌ బ్యాంక్‌ షేరు సుమారు 10.88%, అలహాబాద్‌ బ్యాంక్‌ 7.23%, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 6.57%, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 6.38%, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 5.87%, కెనరా బ్యాంక్‌ 5.71%, ఇండియన్‌ బ్యాంక్‌ 5.04% పెరిగాయి.

అటు ఆంధ్రా బ్యాంక్‌ 4.91%, దేనా బ్యాంక్‌ 3.58%, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 3.10%, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర 2.27%, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 1.35% పెరిగాయి. కేంద్ర రీక్యాపిటలైజేషన్‌ ప్రతిపాదన వీటికి ఊతమిచ్చినట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.   

‘కనీస బ్యాలెన్స్‌’ పెనాల్టీలతో పీఎన్‌బీకి రూ.152 కోట్లు
న్యూఢిల్లీ: మినిమం బ్యాలెన్స్‌ పాటించని పొదుపు ఖాతాలపై జరిమానాల ద్వారా పీఎన్‌బీ గత ఆర్థిక సంవత్సరంలో ఖాతా దారుల నుంచి రూ.151.66 కోట్లు వసూలు చేసింది. 1.23 కోట్ల సేవింగ్స్‌ ఖాతాలపై పీఎన్‌బీ ఈ మేరకు పెనాల్టీలు విధించింది. మినిమం బ్యాలెన్స్‌ పెనాల్టీల ద్వారా వసూలు చేసిన మొత్తం గురించిన వివరాలు వెల్లడించాలంటూ దరఖాస్తు చేసిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్‌ గౌడ్‌కు పీఎన్‌బీ ఈ విషయాలు తెలియజేసింది.

‘2017–18లో మినిమం బ్యాలెన్స్‌ పాటించని 1,22,98,748 సేవింగ్స్‌ అకౌంట్స్‌ నుంచి రూ.151.66 కోట్ల మేర పెనాల్టీని వసూలు చేయడం జరిగింది’ అని పేర్కొంది. ప్రభుత్వం మరింత మందిని బ్యాంకింగ్‌ వ్యవస్థ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. బ్యాంకులు ఇలా మినిమం బ్యాలెన్స్‌ నిబంధనల పేరుతో పెనాల్టీలు విధించడం సరికాదని, ఈ విషయంలో ఆర్‌బీఐ తక్షణం జోక్యం చేసుకోవాలని ఆర్థికవేత్త జయంతిలాల్‌ భండారీ వ్యాఖ్యానించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top