అంతర్జాతీయంగా పసిడి మెరుపు | Gold, Second Fed Hike and Interest Rates | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయంగా పసిడి మెరుపు

Feb 27 2017 4:55 AM | Updated on Oct 1 2018 5:32 PM

అంతర్జాతీయంగా పసిడి మెరుపు - Sakshi

అంతర్జాతీయంగా పసిడి మెరుపు

బంగారం శుక్రవారంతో ముగిసిన వారంలో అంతర్జాతీయంగా మళ్లీ పరుగులు పెట్టింది. ధర నాలుగు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది.

అంతర్జాతీయ సెంటిమెంట్‌ బాగుండడంతో పరుగు  
న్యూఢిల్లీ/న్యూయార్క్‌: బంగారం శుక్రవారంతో ముగిసిన వారంలో  అంతర్జాతీయంగా మళ్లీ పరుగులు పెట్టింది. ధర నాలుగు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది.  అమెరికా నిరుద్యోగ రేటు పెరగడం, దీనితో ఫెడరల్‌ రిజర్వ్‌ రేటు (ఫెడ్‌ ఫండ్‌ రేటు) ప్రస్తుత 0.50 శాతం స్థాయి నుంచి పెంచడంపై అనుమానాలు, డాలర్‌ బలహీన ధోరణి వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు స్వల్పకాలంలో పసిడిని మార్గంగా ఎంచుకుంటున్నట్లు కనబడుతోంది. 

న్యూయార్క్‌ కమోడిటీ మార్కెట్‌లో 24వ తేదీతో ముగిసిన వారంలో ధర ఔన్స్‌ (31.1గ్రా)కు 22 డాలర్లు ఎగసి, 1,257 డాలర్లకు చేరింది. వరుసగా రెండు వారాలు (3, 10వ తేదీల్లో ముగిసిన వారాలు)  ఔన్స్‌ (31.1గ్రా)కు  45 డాలర్లు  పెరిగిన పసిడి ధర,  తరువాతి వారంలో (17వ తేదీతో ముగిసిన వారంలో)మాత్రం  1,235 డాలర్ల వద్దే స్థిరంగా ఉన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల అనిశ్చితే భవిష్యత్తులో పసిడికి మార్గదర్శకమని నిపుణులు భావిస్తున్నారు.

దేశీయంగా రూపాయి ఎఫెక్ట్‌...
దేశీయంగా చూస్తే... అంతర్జాతీయంగా ధర పటిష్టంగా ఉన్నా.... ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో పసిడి ధర శుక్రవారంతో ముగిసిన వారంలో తగ్గింది.  99.9 స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.29,455కు చేరింది. మరోవైపు వెండి కేజీ ధర స్థిరంగా రూ.43,255 వద్ద ఉంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ గణనీయంగా మెరుగుపడ్డం వల్ల అంతర్జాతీయంగా ధర భారీగా పెరిగినా... ఇక్కడ ఈ ప్రభావం కనిపించడం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

దేశీయ ప్రధాన ఫ్యూచర్స్‌ మర్కెట్‌– ఎంసీఎక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న పసిడి 10 గ్రాముల ధర శుక్రవారంతో ముగిసిన వారంలో రూ.29,623 వద్ద ముగిసింది. మరోవైపు ఢిల్లీలో మాత్రం పసిడి ధర దాదాపు రూ.300 ఎగసి నాలుగు వారాల గరిష్టస్థాయి... రూ.30,000పైకి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement