కరోనా వార్తలే కీలకం

Global currency funds notch wins amid coronavirus volatility - Sakshi

ఈ వారంలో మూడు రోజులే ట్రేడింగ్‌

మహావీర్‌ జయంతి, గుడ్‌ఫ్రైడే కారణంగా  నేడు, శుక్రవారం మార్కెట్లు సెలవు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కేసుల పోకడను బట్టే దేశీయంగా గానీ, అంతర్జాతీయంగా గానీ ఈ వారం స్టాక్‌ మార్కెట్ల కదలికలు ఉంటాయని నిపుణులంటున్నారు. సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని వారంటున్నారు. దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం విలువ కదలికలు, ముడి చమురు ధరల గమనం....ఈ అంశాలు  కూడా ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషణ.

ఫిచ్‌ అంచనా ప్రభావం!: 2020–21లో భారత్‌ జీడీపీ వృద్ధి రేటు 2 శాతానికి పడిపోతుందన్న ఫిచ్‌ అంచనా మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చు. నేడు వెలువడే (సోమవారం) సేవల రంగం పీఎమ్‌ఐ గణాంకాలు, 9న ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి. 

దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి అవకాశం....
కాగా కరోనా వైరస్‌ కేసులను బట్టే దేశీ, విదేశీ స్టాక్‌ మార్కెట్ల తీరు ఉంటుందని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎనలిస్ట్‌ సిద్ధార్థ ఖేమ్కా చెప్పారు. మార్కెట్‌ ఇప్పటికే చెప్పుకోదగిన స్థాయిలో కరెక్షన్‌కు గురయిందని, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది మంచి అవకాశమని  అభిప్రాయపడ్డారు.

మహావీర్‌ జయంతి సందర్భంగా నేడు(సోమవారం) సెలవు. అలాగే గుడ్‌ఫ్రైడే (ఈ నెల 10న) సందర్భంగా కూడా స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ జరగదు. దీంతో ఈ వారంలో మూడు రోజులే ట్రేడింగ్‌ జరగనున్నది.  

భారీ విదేశీ నిధులు వెనక్కి..: కరోనా వైరస్‌ కల్లోలం ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో విదేశీ ఇన్వెస్టర్లు మన క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి గత నెలలో రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.61,973 కోట్లు, బాండ్‌ మార్కెట్‌ నుంచి రూ.56,211 కోట్లు వెరసి రూ.1.18,184 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం బహుశా ఇదే మొదటిసారి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top