ఫేస్‌బుక్‌ క్రిప్టో కరెన్సీపై జీ–20 దేశాల దృష్టి

G20 States Focus on Facebook Cristo Currency - Sakshi

లండన్‌: సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ ప్రతిపాదించిన క్రిప్టో కరెన్సీ లిబ్రా కాయిన్‌పై శక్తిమంతమైన జీ20 కూటమి దేశాల నియంత్రణ సంస్థలు దృష్టి పెట్టాయి. ఫేస్‌బుక్‌ క్రిప్టో కరెన్సీ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ చెప్పారు. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ కోణంలో ఫేస్‌బుక్‌ అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఫేస్‌బుక్‌ ప్రాజెక్టు లక్ష్యాలు భారీగానే ఉన్నాయని, అయితే నిబంధనలకు లోబడే అది పనిచేయాల్సి ఉంటుందని బ్యాంక్‌ ఆఫ్‌ ఫ్రాన్స్‌ గవర్నర్‌ ఫ్రాంకోయిస్‌ విల్రాయ్‌ డి గాల్‌ చెప్పారు. ఫేస్‌బుక్‌ క్రిప్టోకరెన్సీకి అనుమతులివ్వడం అంత ఆషామాషీ కాదని, నియంత్రణ సంస్థలతో చర్చించకుండా దీన్ని ప్రవేశపెట్టడం కుదరదని ఇంగ్లండ్‌కి చెందిన ఆర్థిక వ్యవహారాల ప్రాధికార సంస్థ చీఫ్‌ ఆండ్రూ బెయిలీ పేర్కొన్నారు. ఈ వారాంతంలో జీ20 దేశాల నేతలు జపాన్‌లో సమావేశమవుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

బ్యాంకింగ్‌ వ్యవస్థతో సంబంధం లేకుండా ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు ఉపయోగపడే లిబ్రా కాయిన్స్‌ను వచ్చే ఏడాది ప్రవేశపెట్టాలని ఫేస్‌బుక్‌ యోచిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో లావాదేవీల వ్యయాలు గణనీయంగా తగ్గుతుందని, మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవొచ్చని ఫేస్‌బుక్‌ చెబుతోంది. కంపెనీకి రెండు వందల కోట్ల పైగా యూజర్లు ఉండటంతో ఆర్థిక లావాదేవీలపై ఇది గణనీయ ప్రభావం చూపించవచ్చన్న అంచనాలున్నాయి. అయితే, క్రిప్టో కరెన్సీల భద్రతపై సందేహాలుండటం, పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు వీటిని నిషేధించడం కారణంగా ఫేస్‌బుక్‌ లిబ్రా కాయిన్‌ చర్చనీయాంశమైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top