బెదిరింపులు, బల ప్రయోగానికి దూరంగా ఉండాలి
ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించాలి
జీ20 సదస్సు డిక్లరేషన్‌లో స్పష్టికరణ
జోహన్నెస్‌బర్గ్: ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవాలన్న దురాలోచనకు ప్రపంచ దేశాలన్నీ దూరంగా ఉండాలని జీ20 దేశాల కూటమి తేల్చిచెప్పింది. ఈ మేరకు శనివారం జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 దేశాల అధినేతల సదస్సులో 39 పేజీల డిక్లరేషన్ విడుదల చేశారు. పరాయి ప్రాంతాల ఆక్రమణ కోసం బెదిరింపులు గానీ, బల ప్రయోగం గానీ చేయడానికి వీల్లేదని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.
ఏ దేశమైనా సరే ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం లేదా రాజకీయ స్వతంత్రతను గౌరవించాల్సిందేనని ఉద్ఘాటించారు. జీ20 సదస్సుకు హాజరైన సభ్యదేశాల నేతలు ఏకాభిప్రాయంతో డిక్లరేషన్‌ను ఆమోదించారు. ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలపడాలని ఆకాంక్షించారు. మానవ హక్కులను, ప్రజల స్వేచ్ఛను అందరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. మతం, భాష, ప్రాంతం, జాతి, స్త్రీ–పురుష అనే వివక్ష లేకుండా అందరినీ సమానంగా పరిగణించాలని కోరారు. నేడు భౌగోళిక రాజకీయ, భౌగోళిక ఆర్థిక పోటీ పెరుగుతుండడంతో ప్రతికూల పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రపంచ దేశాల సమగ్ర అభివృద్ధికి పరస్పర సహకారం, సంఘీభావం, సమానత్వం, సుస్థిరతలే కీలక మూలస్తంభాలని వివరించారు. ఇంధన భద్రత, వాతావరణ మార్పుల నియంత్రణ, విపత్తుల నివారణ వంటి అంశాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రష్యా, ఇజ్రాయెల్, మయన్మార్ దుందుడుకు చర్యలను పరోక్షంగా తప్పుపట్టారు. ఈసారి జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ హాజరుకాకపోవడం గమనార్హం. డిక్లరేషన్‌లోని కొన్ని అంశాలను ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా, జీ20 డిక్లరేషన్‌ను సాధారణంగా సదస్సు ముగింపు సమయంలో విడుదల చేస్తుంటారు. ఈసారి సద స్సు ప్రారంభంలోనే విడుదల చేయడం విశేషం.
వ్యత్యాసాలు సమసిపోవాలి: రమఫోసా
సంపద, అభివృద్ధి వంటి విషయాల్లో దేశాల మధ్య వ్యత్యాసాలు పూర్తిగా సమసిపోవాలని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఆకాంక్షించారు. ఇలాంటి వ్యత్యాసాలు అన్యాయం, అవాంఛనీయమని పేర్కొన్నారు. శనివారం జీ20 సదస్సులో ఆయన ప్రారం¿ోపన్యాసం చేశారు.


