ఎఫ్‌పీఐలు- పెట్టుబడుల యూటర్న్‌ | FPI investment U-turn in equities | Sakshi
Sakshi News home page

ఎఫ్‌పీఐలు- పెట్టుబడుల యూటర్న్‌

Jun 8 2020 10:42 AM | Updated on Jun 8 2020 10:42 AM

FPI investment U-turn in equities  - Sakshi

దేశీ స్టాక్‌ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఒక్కసారిగా కొనుగోళ్ల యూటర్న్‌ తీసుకున్నారు. అమ్మకాలను వీడి ఇటీవల నికర పెట్టుబడిదారులుగా నిలుస్తున్నారు. ఫలితంగా గత ఏడు ట్రేడింగ్‌ సెషన్లలోనే దేశీ ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ. 23,000 కోట్ల(3 బిలియన్‌ డాలర్లు)ను ఇన్వెస్ట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19  కాటువేయనున్న భయాలతో మార్చిలో ఎఫ్‌పీఐలు భారీ అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. మార్చి నెలలో ఎఫ్‌పీఐలు రూ. 58,600 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఏప్రిల్‌లో కొంతమేర నెమ్మదించి రూ. 4,100 కోట్ల పెట్టుబడులను మాత్రమే వెనక్కి తీసుకున్నారు. ఇక మే నెలలో రూ. 12,000 కోట్లను నికరంగా ఇన్వెస్ట్‌ చేశారు. ప్రధానంగా బల్క్‌డీల్స్‌ ద్వారా కొన్ని కంపెనీలలో వాటాలను సొంతం చేసుకున్నారు. కాగా.. ఇటీవల దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐల పెట్టుబడులు దక్షిణ కొరియా, తైవాన్‌ వంటి ఇతర ఆసియా మార్కెట్లకంటే అధికంగా నమోదుకావడం గమనార్హం!

ఇదీ తీరు
ఏప్రిల్‌ తదుపరి జపాన్‌ మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు 35.2 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. గత వారం రోజుల్లో దక్షిణ కొరియాలో 34.5 కోట్ల డాలర్లు, తైవాన్‌లో 85.3 కోట్ల డాలర్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశారు. దేశీయంగా విదేశీ పెట్టుబడులు కొనసాగే వీలున్నట్లు కొటక్‌ మహీంద్రా ఏఎంసీ ఎండీ నీలేష్‌ షా పేర్కొన్నారు. అయితే వృద్ధి అవకాశాలున్న రంగాలు, కంపెనీలవైపు ఎఫ్‌పీఐలు దృష్టిసారిస్తారని అభిప్రాయపడ్డారు. కొన్ని షేర్లకే ఎఫ్‌పీఐల పెట్టుబడులు ప్రవహిస్తున్నట్లు చెప్పారు. కాగా.. గత కొద్ది రోజులుగా ఇండెక్స్‌ కౌంటర్లలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, ఓఎన్‌జీసీ, టైటన్‌ ర్యాలీ చేస్తున్నాయి. ఈ కౌంటర్లు గత 7 రోజుల్లో 10-23 శాతం మధ్య లాభపడ్డాయి.

నిఫ్టీ స్పీడ్‌
గత 7 రోజుల్లో నిఫ్టీ 9 శాతం పుంజుకోగా.. సెన్సెక్స్‌ 6.4 శాతం లాభపడింది. ఏప్రిల్‌లో బౌన్స్‌బ్యాక్‌ సాధించిన మార్కెట్లు మే నెలలో ఒడిదొడుకుల మధ్య కదిలిన విషయం విదితమే. వెరసి మే కనిష్టాల నుంచి సెన్సెక్స్‌ 14.5 శాతం బలపడగా.. నిఫ్టీ 15.2 శాతం ఎగసింది. ఇటీవల యూఎస్‌ మార్కెట్లు భారీ ర్యాలీ చేయడంతో ఎఫ్‌పీఐలు ఇతర దేశాలవైపు చూస్తున్నట్లు ఇన్వెస్కో మాజీ వైస్‌చైర్మన్‌ కృష్ణ ఎం చెప్పారు. కేంద్ర బ్యాంకులు అందిస్తున్న భారీ లిక్విడిటీ కారణంగా ఎఫ్‌పీఐలు పలు దేశాల ఈక్విటీలలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. అయితే మార్చి కనిష్టాల నుంచి చూస్తే ఎస్‌అండ్‌పీ 40 శాతం ర్యాలీ చేయగా.. గత వారం నాస్‌డాక్‌ ఇండెక్స్‌ సరికొత్త గరిష్టాలను అందుకుంది. ఈ బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం మార్చి కనిష్టం 7511 నుంచి చూస్తే.. 10,200కు చేరడం ద్వారా 35 శాతంపైగా రికవరీ సాధించింది. దీంతో ఇకపై మార్కెట్లు మరికొంత బలపడేందుకు వీలున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ సీఈవో రజత్‌ అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement