
బంగారం ధరలు గత కొంత కాలంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో గోల్డ్ రేటు మరింత పెరిగి పసిడి ప్రియులను అవాక్కయ్యాలా చేసింది. ఈ స్థాయిలో కనకం ధరలు పెరగడానికి కారణం ఏమిటనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత పెంచిన సుంకాలు చాలామంది పెట్టుబడిదారుల్లో భయాన్ని రేకెత్తించింది. స్టాక్ మార్కెట్లు కుప్ప కూలుతుంటే.. బంగారం రేటు మాత్రం ఆకాశాన్నంటుతోంది. దీనికి ప్రధాన కారణం పెట్టుబడిదారులు.. గోల్డ్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడమే అని నిపుణులు భావిస్తున్నారు.
2025 ఆగస్టు 01న గరిష్టంగా రూ. 210 తగ్గి రూ.99,820 (10 గ్రా 24 క్యారెట్స్) వద్ద నిలిచిన గోల్డ్ రేటు.. ఆ తరువాత ఆగస్టు 08 నాటికి రూ. 1,03,310 కు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధర ఈ మధ్య కాలంలోనే రూ. 3490 పెరిగింది. ఇది బంగారం ధరలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయి తెలుపడానికి నిదర్శనం.
బంగారు కడ్డీలపై అమెరికా సుంకాలు, బలహీనమైన అమెరికా డాలర్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపుపై మార్కెట్ అంచనాలు, ఆర్థిక అనిశ్చితి మధ్య పెరుగుతున్న ప్రపంచ డిమాండ్ వంటివన్నీ గోల్డ్ రేటు పెరగడానికి కారణమవుతున్నాయి.
ఇదీ చదవండి: ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..
అస్థిర ఆర్థిక పరిస్థితుల్లో బంగారం సురక్షితమైన ఆస్తి. కాబట్టి గోల్డ్ కొనుగోలు చేసే పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరిగింది. ఓ వైపు శ్రావణమాసం.. మరోవైపు వస్తున్న పండుగ సీజన్. ఇవన్నీ కూడా బంగారం ధరలను మరింత పెంచే అవకాశం ఉంది. 2005లో రూ. 7000 వద్ద ఉన్న గోల్డ్ రేటు.. 2025లో రూ. 100000 దాటేసింది. దీన్నిబట్టి చూస్తే దశాబ్దంలో రేటు ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.