పాత వస్తువులు కొత్తగా.. ఫ్లిప్‌కార్ట్‌ న్యూ ప్లాట్‌ఫామ్‌

Flipkart Launches 2GUD Refurbished Goods Platform In Wake Of eBay India Shutdown - Sakshi

బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన అనంతరం.. పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ అంతకముందు తాను దక్కించుకున్న ఈబే ఇండియాను మూసివేసింది. ఈబేను మూసివేసిన ఫ్లిప్‌కార్ట్‌.. రీఫర్‌బిష్డ్‌ గూడ్స్‌(పాతవాటినే మళ్లీ కొత్తగా మార్చిన వస్తువుల) కోసం సరికొత్త ప్లాట్‌ఫామ్‌ను తెరిచింది. అదే 2గుడ్‌. రీఫర్‌బిష్డ్‌ గూడ్స్‌ కోసం కంపెనీ ఏర్పాటు చేసిన తొలి ప్లాట్‌ఫామ్‌. వచ్చే ఐదు నుంచి ఆరేళ్లలో ఈ మార్కెట్‌ 20 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ ఈ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ 2గుడ్‌ ప్లాట్‌ఫామ్‌ తొలుత రీఫర్‌బిష్డ్‌ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఎలక్ట్రానిక్‌ యాక్ససరీస్‌ను అందుబాటులో ఉంచనుంది. ఆ తర్వాత హోమ్‌ అప్లియెన్స్‌కు కూడా దీన్ని విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ ప్లాట్‌ఫామ్‌ లైవ్‌గా కస్టమర్లకు అందుబాటులో ఉన్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌ 2గుడ్‌ వస్తువును కొనుగోలు చేసిన తర్వాత 3 నెలల నుంచి 12 నెలల వారెంటీ ఇస్తుంది. మొబైల్‌ వెబ్‌ ద్వారా మాత్రమే తొలుత ఇది అందుబాటులో ఉంటుంది. కానీ తర్వాత తర్వాత డెస్క్‌టాప్‌ వెబ్‌ ఇంటర్‌ఫేస్‌, మొబైల్‌ యాప్‌ యూజర్లకు కూడా చేరువ చేయాలని ఫ్లిప్‌కార్ట్‌ యోచిస్తోంది. ఈబే ఇండియాను మూసివేసే సమయంలో ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌ గురించి ఆ కంపెనీ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి ప్రస్తావించారు. ఈబే.ఇన్‌ నుంచి పలు విషయాలు బోధపడ్డాయని, అవే రీఫర్‌బిష్డ్‌ గూడ్స్‌ కోసం కొత్త ప్లాట్‌ఫామ్‌కు దోహదం చేసిందని పేర్కొన్నారు. ఆగస్టు 14 నుంచి ఈబే ఇండియా అధికారికంగా మూతపడింది. మార్కెట్‌ లీడర్‌గా.. ఫ్లిప్‌కార్ట్‌ మరింత షాపింగ్‌ అనుభవాన్ని అందించడానికే కృషిచేస్తుందన్నారు. రీఫర్‌బిష్డ్‌ గూడ్స్‌ మార్కెట్‌ విషయంలో ఉన్న నమ్మకపు లోపాన్ని తాము 2గుడ్‌ ద్వారా తొలగించనున్నామని పేర్కొన్నారు. సరసమైన ధరల్లో క్వాలిటీ ప్రొడక్ట్స్‌ అందజేస్తామని కల్యాణ్‌ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు. 

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top