ఆర్‌బీఐతో ఎన్‌బీఎఫ్‌సీ ఆస్తుల కొనుగోలు?

Finance Ministry Wants RBI To Take Over Stressed Assets Of NBFCs - Sakshi

ఇందుకోసం ఎస్‌పీవీ ఏర్పాటు

ఒత్తిళ్లు తగ్గించే దిశగా కేంద్రం యోచన

ఆర్థిక శాఖ, ఆర్‌బీఐ మధ్య చర్చలు

న్యూఢిల్లీ: తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (ఎన్‌బీఎఫ్‌సీలు) చేదోడుగా నిలవాల్సిన అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి చెందిన నాణ్యమైన ఆస్తులను (రుణాలు) ప్రభుత్వరంగ బ్యాంకులతో కొనుగోలు చేయించే దిశగా గతంలోనే ఆదేశాలు జారీ చేయగా.. తాజాగా ఈ రంగానికి సంబంధించి ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఆస్తులను (మొండి బకాయిలు) ఆర్‌బీఐతో కొనుగోలు చేయించే దిశగా కార్యాచరణపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. చర్చలు ఉన్నత స్థాయిలో మొదలయ్యాయని, 2008లో అమెరికా ప్రభుత్వం అనుసరించిన ట్రబుల్డ్‌ అస్సెట్‌ రిలీఫ్‌ ప్రొగ్రామ్‌ (సమస్యాత్మక ఆస్తులకు సంబంధించి ఉపశమనం కల్పించే కార్యక్రమం/టీఏఆర్‌పీ) తరహాలో ఇది ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అగ్ర స్థాయి 25 ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల సమస్యాత్మక ఆస్తులను కొనుగోలు చేసే పథకంపై ఆర్‌బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. ఆర్‌బీఐ మద్దతుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ/ప్రత్యేక అవసరాల కోసం ఉద్దేశించిన వేదిక) లేదా విడిగా ఒక ఎస్‌పీవీని ఏర్పాటు చేసి, దానితో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల  ఒత్తిడి రుణాలను కొనుగోలు చేయించాలన్నది ప్రభుత్వం ఆలోచన. తద్వారా ఎన్‌బీఎఫ్‌సీ రంగం ఇబ్బందులను తొలగించొచ్చని భావిస్తోంది. ‘‘చర్చలు మొదలయ్యాయి. చిన్నపాటి టీఏఆర్‌పీ తరహా కార్యక్రమంపై ఇప్పటికే ఆర్‌బీఐతో పలు విడతల పాటు చర్చలు జరిగాయి’’ అని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన ఆ వర్గాలు వెల్లడించాయి.  

అమెరికాలో జరిగినట్లే....
2008 లెహమాన్‌ సంక్షోభ సమయంలో అమెరికా కేంద్ర బ్యాంకు  యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ టీఏఆర్‌పీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆరి్థక సంస్థల వద్దనున్న సమస్యాత్మక రుణ ఆస్తులను కొనుగోలు చేయడం ద్వారా ఆరి్థక రంగాన్ని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇదే విధంగా మన దేశంలోనూ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల నుంచి ఒత్తిడిలోని రుణాలను ఆర్‌బీఐతో కొనుగోలు చేయించాలన్నది కేంద్రం ప్రయత్నంగా తెలుస్తోంది. అయితే, తన బ్యాలన్స్‌ షీటులోని నిధులతో ఎన్‌బీఎఫ్‌సీ సమస్యాత్మక రుణ ఆస్తులను కొనుగోలు చేయించే ఆలోచనను ఆర్‌బీఐ వ్యతిరేకించినట్టు ఓ అధికారి తెలిపారు. అయినప్పటికీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొ న్నారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి కేంద్రం ఇప్పటికే పలు విధాలుగా సహకారం అందించింది. ప్రభుత్వరంగ బ్యాంకులతో రూ.21,850 కోట్ల విలువైన ఎన్‌బీఎఫ్‌సీ రుణ ఆస్తులను అక్టోబర్‌ 16 నాటికి కొనుగోలు చేయించింది. అలాగే, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకు రూ.30,000 కోట్ల వరకు అదనంగా ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి నిధుల సాయాన్ని పెంచింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top