బేరిష్‌గా బంగారం..

Fed rates may increase - Sakshi

బలపడుతున్న డాలరు

ఫెడ్‌ రేట్ల పెంపు అంచనాలు

న్యూఢిల్లీ: బలపడుతున్న డాలరు, అమెరికా ఫెడ్‌ రేట్ల పెంపు అంచనాలు ఈ వారం బంగారానికి ప్రతికూలంగా ఉండొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. వీటితో పాటు అమెరికాలో హైరింగ్‌ సరళి మందగిస్తోందన్న అభిప్రాయాలను రూఢీ చేసుకునేందుకు జూలై ఉద్యోగిత గణాంకాలను కూడా ట్రేడర్లు నిశితంగా పరిశీలించవచ్చని అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు అంతర్జాతీయంగా వాణిజ్య వివాదాలకు సంబంధించిన పరిణామాలపై సైతం మెటల్స్‌ ట్రేడర్లు దృష్టి పెట్టనున్నారు.

ఈ నెలలో జరగబోయే సమావేశంలో ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశంలో రేట్లను పెంచే అవకాశాలున్నాయన్న అంచనాలు.. బంగారానికి ప్రతికూలంగా ఉండొచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. వీటన్నింటి దరిమిలా గత వారాంతంలో న్యూయార్క్‌ మెర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌ కామెక్స్‌ విభాగంలో ఆగస్టు డెలివరీ బంగారం ఫ్యూచర్స్‌ ధర 0.29 శాతం తగ్గి 1,222.20 వద్ద ముగిసింది. మొత్తం మీద అంతర్జాతీయంగా వారంలో 0.56 శాతం, ఈ ఏడాది ఇప్పటిదాకా 6.4 శాతం మేర పసిడి రేటు క్షీణించినట్లయింది.  

దేశీయంగా మళ్లీ 31వేల పైకి..
పండుగల సీజన్, స్థానిక జ్యూయలర్ల కొనుగోళ్ల మద్దతుతో బంగారం ధర దేశీయంగా మళ్లీ కీలకమైన రూ. 31,000 మార్కు పైకి చేరింది. న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో పది గ్రాములకు రూ. 450 మేర పెరిగింది. మేలిమి బంగారం (99.9 శాతం స్వచ్ఛత) పది గ్రాముల ధర రూ. 31,350, ఆభరణాల బంగారం (99.5 శాతం స్వచ్ఛత) రేటు రూ. 31,200 వద్ద ముగిసింది. వెండి కిలో ధర రూ. 100 మేర పెరిగి రూ. 38,350 వద్ద క్లోజయ్యింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top