నాలుగు రోజుల మౌనానికి చెక్‌

Facebook Mark Zuckerberg admits mistakes, outlines fixes - Sakshi

నాలుగురోజుల తరువాత మౌనం వీడిన సీఈవో జుకర్‌బర్గ్‌

పొరపాటు జరిగింది..సరిదిద్దుతున్నాం

చేయాల్సింది చాలా ఉంది

వినియోగదారుల డేటాను రక్షించే బాధ్యత​  మాదే

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన డేటాబ్రీచ్‌పై ఎట్టకేలకు  ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ నోరు విప్పారు.  సుమారు 5కోట్లమంది ఫేస్‌బుక్‌  యూజర్ల సమాచారం లీక్‌ అయిందన్న దుమారం రేగిన నాలుగు రోజుల తరువాత  స్పందించారు.  తన అధికారిక ఫేస్‌బుక్‌  పేజీలో జుకర్‌బర్గ్‌ ఒక పోస్ట్‌ పెట్టారు. డాటా లీక్‌ వ్యవహారంలో తప్పయిందంటూ ఆయన  అంగీకరించారు. అయితే అదృష్టవశాత్తూ తాము ఇప్పటికే డేటా రక్షణకు సంబంధించి చర్యలు చేపట్టామని వివరణ ఇచ్చారు. ఇది కోగన్, కేంబ్రిడ్జ్ ఎనలిటికా , ఫేస్‌బుక్‌మధ్య విశ్వాస ఉల్లంఘన. అంతేకాదు ఇది ఫేస్‌బుక్‌కు, డేటాను సంస్థతో  పంచుకున్న యూజర్లకూ మధ్య ఉన్న  నమ్మకాన్ని కూడా  దెబ్బతీసిందని పేర్కొన్నారు.  దీనిని  పరిష్కరించాల్సిన అవసరం ఉందని జుకర్‌ బర్గ్‌ ఒప్పుకున్నారు.

కేంబ్రిడ్జ్‌ ఎనలిటికాకు సంబంధించి కొంత అప్‌డేట్‌ ఇవ్వదల్చుకున్నానంటూ  మొదలుపెట్టిన జుకర్‌బర్గ్‌ ..సంస్థ ఇప్పటికే తీసుకున్న వివిధ దశలతోపాటు ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించడానికి తదుపరి దశల గురించి ఇలా వివరించారు. ‘‘ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి ఘోరమైన తప్పిదం మళ్లీ జరదని హామీ ఇస్తున్నాం. ఇలాంటివి మళ్ళీ జరగకుండా నిరోధించడానికి అత్యంత ముఖ్యమైన చర్యలు మేము ఇప్పటికే కొన్ని సంవత్సరాల క్రితమే తీసుకున్నాం.  అయినా కొన్ని పొరపాట్లు జరిగాయి. దిద్దుబాటు చర్యలు  చేపట్టాం. ఇంకా చేయాల్సి చాలా ఉంది. యూజర్ల  డేటా రక్షించడం  మా ప్రధాన బాధ్యత. అలా చేయని నాడు యూజర్లకు సేవ చేసే అర్హతను కోల్పోతాం. ఈ సంఘటనపై సంస్థద్వారా ఫోరెన్సిక్ ఆడిట్‌ నిర్వహిస్తున్నాం. రెగ్యులేటరీ, విచారణాధికారులతో కలిసి పనిచేస్తున్నాము. సంస్థ మీద విశ్వాసం ఉంచిన మీ అందరికీ ధన్యవాదాలు. కలసి పనిచేద్దాం. సమస్య పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టవచ్చు. కానీ ఇంతకంటే మెరుగైన సేవలతో మరింత ఎక్కువ కాలం మీకు సేవలందిస్తామని హామీ ఇస్తున్నాను.’’  దీంతో పాటు  ఫేస్‌బుక్‌ ప్రారంభంనుంచి తీసుకున్న చర్యలపైకూడా జుకర్‌ బర్గ్‌ సవివరంగా తన పోస్ట్‌లో  పేర్కొన్నారు.

మరోవైపు ప్రత్యర్థి అభ్యర్థులపై హానీట్రాప్‌ (అమ్మాయిలను ఎరగావేయటం)కూ వెనుకాడరని ఈ సంస్థపై ఆరోపణలున్న నేపథ్యంలో  బీబీసీ ఛానెల్‌ 4 ‘స్టింగ్‌ ఆపరేషన్‌’ లో సీఏ సీఈఓ అలెగ్జాండర్‌ నిక్స్‌ వ్యాఖ్యల్ని ప్రసారం చేసిన తరువాత నిక్స్‌పై వేటు పడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top