ఎల్‌టీసీజీ ఉన్నా ఈక్విటీ ఫండ్స్‌ ఓకే!!

Expert advice on market - Sakshi

దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ–లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌) మళ్లీ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదేనా? – పరిమళ, సికింద్రాబాద్‌
దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ–లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌) మళ్లీ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం మంచిదే. ఈ  ఫండ్స్‌ తమ మొత్తం నిధుల్లో ఈక్విటీల్లో మూడో వంతు, ఆర్బిట్రేజ్‌ ఫండ్స్‌లో మరో మూడో వంతు,  ఫిక్స్‌డ్‌–ఇన్‌కమ్‌ సాధనాల్లో మరో మూడో వంతు చొప్పున ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈ ఫండ్స్‌లో ఏడాదికి మించి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగితే మీరు పొందే రాబడులపై 10 శాతం మేర పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ఫండ్స్‌ నుంచి స్టిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకుంటే అది మరింత అర్థవంతంగా ఉంటుంది. ఈక్విటీలో పెట్టిన  మూడో వంతు పెట్టుబడిని రీ–బ్యాలెన్సింగ్‌కు వినియోగిస్తారు. దీనిపై ఎలాంటి పన్ను భారాలూ ఉండవు. అందుకని ఈక్విటీ సేవింగ్స్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కొనసాగించవచ్చు. దీంట్లో గ్రోత్‌ ప్లాన్‌ను ఎంచుకోవాలి. సిస్టమాటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) ద్వారా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవాలి. రోజులు గడిచే కొద్దీ, ద్రవ్యోల్బణం కారణంగా ఈ ఈక్విటీ సేవింగ్స్‌ స్కీమ్స్‌ ఆకర్షణ కోల్పోవచ్చు. పెట్టుబడి సంబంధిత కేటాయింపులు కారణంగా వీటికి మాత్రం ప్రాధాన్యత తగ్గదనే చెప్పవచ్చు.

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లకు ఇచ్చే డివిడెండ్లపై  డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ) విధించారు కదా! ఈ సందర్భంలో డివిడెండ్‌ ప్లాన్‌ను ఎంచుకోవాలా ? లేకుంటే గ్రోత్‌ ఆప్షన్‌లో ఇన్వెస్ట్‌ చేయాలా? – సుధాకర్, విజయవాడ
ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అందించే డివిడెండ్లపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ) విధించిన నేపథ్యంలో గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకోవడమే ఉత్తమం. డీడీటీ విధింపుకు ముందు కూడా గ్రోత్‌ ప్లాన్‌లే ఆకర్షణీయంగా ఉండేవి. చాలా ఈక్విటీ ఫండ్స్‌ ఇచ్చే డివిడెండ్‌లను పరిశీలిస్తే, ఆయా ఫండ్ల డివిడెండ్‌ ఈల్డ్‌ ఆరు నుంచి ఏడు శాతానికి మించి ఉండేది కాదు.  ఈక్విటీ ఫండ్స్‌ గ్రోత్‌ ఆప్షన్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే ఇంతకు మించి మంచి రాబడులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి.

ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా పీరియాడిక్‌ ఆదాయం(డివిడెండ్ల ద్వారా కొంత మొత్తంలో) పొందాలనుకోకూడదు. ఉదాహరణకు రూ.10 ముఖ విలువ గల ఒక ఈక్విటీ ఫండ్‌ను తీసుకుందాం. దీని ఎన్‌ఏవీ రూ.15 ఉంది. ఇది 10 శాతం డివిడెండ్‌ను ప్రకటించింది. మీరు డివిడెండ్‌ ఆప్షన్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మీకు రూ.1 డివిడెండ్‌ లభిస్తుంది.  ఈ మేరకు ఎన్‌ఏవీ రూ.14కు తగ్గుతుంది. 10 శాతం డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే మీకు 90 పైసలే డివిడెండ్‌ వస్తుంది. అదే గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకుంటే, ఎన్‌ఏవీ రూ.15 అలాగే కొనసాగుతుంది. పైగా ఎలాంటి పన్ను భారం కూడా ఉండదు.

నేను సీనియర్‌ సిటిజన్‌ను. నేను గతంలో ఇన్వెస్ట్‌ చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఒకటి ఇటీవలే మెచ్యూర్‌ అయింది. ఈ మొత్తాన్ని  ఇన్వెస్ట్‌ చేసి నెలవారీ కొంత ఆదాయాన్ని పొందాలనేది నా ఆలోచన. దీనికి తగ్గట్టుగా మంచి పెట్టుబడి వ్యూహాన్ని సూచించండి? – ఆంజనేయులు, విశాఖపట్టణం
ముందుగా  మీ జీవన వ్యయాలకు అవసరమయ్యే నెలవారీ ఖర్చులను పూర్తిగా రాసుకోండి. మీ నెలవారీ అవసరాలకు ఎంత మొత్తం అవసరమవుతుందో లెక్కించండి. ఈ అవసరాలను తీర్చే ఇతర ఆదాయాలు.. (ఉదాహరణకు మీకు ఇంటద్దెలు రావడం కానీ, పెన్షన్‌ రావడం కానీ) ఏమీ లేని పక్షంలో సీనియర్‌ సిటిజన్స్‌ స్కీమ్‌లో రూ.15 లక్షల వరకూ ఇన్వెస్ట్‌ చేయండి. ఈ స్కీమ్‌లో మీకు 8.3 శాతం వడ్డీ లభిస్తుంది. ఇది పూర్తిగా సురక్షితం. మీకు మూడు నెలలకొకసారి వడ్డీ వస్తుంది.

ఎల్‌ఐసీకి చెందిన ప్రధాన మంత్రి వ్యయ వందన యోజనలో కూడా గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలు. దీనిపై కూడా 8.3 శాతం వడ్డీ వస్తుంది. ఈ రెండు స్కీమ్‌లూ సురక్షితమైనవే. ఒకటి పూర్తిగా ప్రభుత్వం ఆఫర్‌ చేస్తున్న స్కీమ్‌ కాగా, మరొకటి ప్రభుత్వం స్పాన్సర్‌చేస్తున్న స్కీమ్‌. ఇక మిగిలిన మొత్తాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్‌ చేయాలి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సురక్షితమైనవే కానీ, మీ పెట్టుబడి వ్యూహానికి అవి తగవు. రిటైర్మెంట్‌ వ్యక్తులకు ద్రవ్యోల్బణంతో తట్టుకునే క్రమబద్ధమైన ఆదాయం అవసరం.

స్థిరాదాయం అందించే ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాలు ప్రస్తుత అవసరాలకు తగ్గ ఆదాయాన్ని మాత్రమే ఇవ్వగలవు. మూడేళ్ల తర్వాత ద్రవ్యోల్బణంతో పాటు ధరలు కూడా పెరుగుతాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మీ ఆదాయం కూడా పెరగాలి. కానీ ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సాధనాల్లో మీ పెట్టుబడి కూడా స్థిరంగానే ఉంటుంది. కానీ వృద్ధి ఉండదు. ఐదు లేదా పదేళ్ల కాలానికి ద్రవ్యోల్బణంతో పాటే పెరిగేలా మీ రాబడులు ఉండాలి. దీనికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయడమే సరైన మార్గం.

ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మీ పెట్టుబడికి రక్షణ ఉండాలి. అలాగే ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగానే రాబడులు ఉండాలి. ఈక్విటీల్లో ఎప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయకూడదు. వయస్సు పెరుగుతున్న కొద్దీ రిస్క్‌ను తగ్గించుకోవాలి. అందుకని మీ మొత్తం పెట్టుబడుల్లో 30 నుంచి 40 శాతం కంటే ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయొద్దు.

- ధీరేంద్ర కుమార్‌ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top