ఐవోసీ, ఓఎన్‌జీసీపై డివిడెండ్‌ ఒత్తిడి 

Dividend pressure on IOC and ONGC - Sakshi

రెండో మధ్యంతర  డివిడెండ్‌ కావాలంటున్న కేంద్రం 

న్యూఢిల్లీ:  పన్ను ఆదాయాలు ఆశించినంత స్థాయిలో కనిపించని నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసుకునే మార్గాలపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి మధ్యంతర డివిడెండ్‌ ఇచ్చేలా ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ)లపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై చర్చించేందుకు మార్చి 19న ఐవోసీ బోర్డు సమావేశం కానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, నెల రోజుల వ్యవధిలో మరోసారి మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేంతగా మిగులు నిధులు తమ వద్ద లేవని కేంద్రానికి ఓఎన్‌జీసీ తెలిపినట్లు సమాచారం. ఐవోసీ డిసెంబర్‌లో షేరు ఒక్కింటికి రూ. 6.75 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించడంతో పాటు షేర్ల బైబ్యాక్‌ ద్వారా రూ. 4,435 కోట్ల ప్రభుత్వానికి అందించింది.  
ఇక ఫిబ్రవరి 14న ఓఎన్‌జీసీ షేరుకి రూ. 5.25 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది.

అలాగే రూ. 4,022 కోట్ల మేర షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు కూడా ఆమోదముద్ర వేసింది. నిబంధనల ప్రకారం కేవలం నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వడం కుదరదు. ఇందుకోసం మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని, ఒకవేళ ఆమోదం లభించినా.. ఇప్పటికే ప్రకటించిన మధ్యంతర డివిడెండు, షేర్ల బైబ్యాక్‌కు నిధులు ఖర్చు చేసేస్తే రెండో మధ్యంతర డివిడెండ్‌ ఇచ్చేంత నిధులు ఉండవని ఓఎన్‌జీసీ చెబుతోంది. వస్తు, సేవల పన్నుల వసూళ్లు రూ. 30,000–40,000 కోట్లు, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కూడా దాదాపు అదే స్థాయిలో తక్కువగా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో నిర్దేశిత ద్రవ్య లోటు లక్ష్యం 3.4 శాతంలోపు కట్టడి చేసేందుకు కేంద్రం నానా తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆదాయ లోటు భర్తీకి మార్గాలు అన్వేషిస్తోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top