
న్యూఢిల్లీ : దేశరాజధానిలో డీజిల్ ధరలు సరికొత్త రికార్డు స్థాయిలోకి ఎగిశాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో, దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఇంధన ధరలు భారీగా పైకి పెరుగుతున్నట్టు తెలిసింది. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఢిల్లీలో లీటరు డీజిల్‌ను రూ.59.70కు విక్రయించినట్టు తెలిసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక స్థాయి. కోల్‌కత్తా, చెన్నైలో కూడా డీజిల్ ధరలు 2014 సెప్టెంబర్ నాటి గరిష్ట స్థాయిలను నమోదుచేస్తున్నాయి. ముంబైలో కూడా డీజిల్ ధరలు 2017 మార్చి నాటి స్థాయిలను నమోదుచేస్తున్నట్టు తెలిసింది.
అదేవిధంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కత్తా, మిగతా నగరాల్లో పెట్రోల్ ధరలు కూడా 2017 అక్టోబర్ 3 నాటి అత్యధిక ధరలు పలుకుతున్నట్టు వెల్లడైంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో, కస్టమర్లకు కాస్త ఉపశమనం కల్పించడానికి పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం అక్టోబర్ నెలలోనే ఎక్సైజ్ డ్యూటీని రూ.2 తగ్గించింది. అదే నెలలో వంటగ్యాస్‌పై నెలవారీ పెంపుదల చేపడుతున్న ధరల నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఇంధన ధరలను రోజువారీ సమీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. రోజువారీ సమీక్ష చేపట్టినప్పటి నుంచి అంతర్జాతీయంగా ధరలు పెరగడమే తప్ప తగ్గడం కనిపించలేదు. దీంతో దేశీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి.
నగరాలు డీజిల్ ధరలు(లీటరుకు రూపాయిల్లో) పెట్రోల్ ధరలు(లీటరుకు రూపాయిల్లో)
ఢిల్లీ 59.70 69.97
కోల్‌కత్తా 62.36 72.72
ముంబై 63.35 77.87
చెన్నై 62.90 72.53