సీఈఓలపై క్రిమినల్‌ చర్యలు!

Curb NPA fraud or face action, FinMin tells PSU bank CEOs - Sakshi

రూ. 50 కోట్లు దాటిన మొండి బకాయిల్ని బ్యాంకులు గుర్తించాలి

వాటిపై ముందే ప్రభుత్వానికి సమాచారమివ్వాలి

లేకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు

ఆదేశాలు జారీ చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ?  

న్యూఢిల్లీ: మొండి బకాయిల విషయమై ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సీఈఓలకు కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన హెచ్చరిక జారీ చేసినట్లు తెలిసింది.  రూ.50 కోట్లకు మించిన మొండి పద్దులను బ్యాంక్‌ సీఈఓలు గుర్తించాలని, అలా చేయని పక్షంలో వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించినట్లు తెలియవచ్చింది.

రూ.2,000 కోట్ల మేర బ్యాంక్‌ రుణాలను స్వాహా చేసినందుకు భూషణ్‌ స్టీల్‌ ప్రమోటర్‌ నీరజ్‌ సింఘాల్‌ను సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) ఇటీవల అరెస్టు చేయడం తెలిసిందే. అలాగే ప్రస్తుతం పన్నెండుకు పైగా కంపెనీలపై దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు.  

ఐపీసీ సెక్షన్‌ 120బి ప్రకారం చర్యలు....
పరిశోధన సంస్థల దర్యాప్తులో బ్యాంక్‌ రుణాలకు సంబంధించిన మోసాలు వెలుగులోకి వస్తే... సదరు బ్యాంక్‌ సీఈఓలపై భారత శిక్షాస్మృతి(ఐపీసీ) సెక్షన్‌ 120బి ప్రకారం చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సలహాను బ్యాంక్‌ సీఈఓలు అదనపు ముందు జాగ్రత్తగా పరిగణించాలని, న్యాయ వివాదాల్లోకి మునిగిపోకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆ వర్గాలు తెలిపాయి.

మొండి బకాయిల విషయమై అలక్ష్యం వహిస్తే, బ్యాంక్‌ సీఈఓలపై క్రిమినల్‌  చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించడం నిజమేనని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. భూషణ్‌ స్టీల్, మరో రియల్టీ కంపెనీ విషయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. మొండి బకాయిల విషయమై సీఈఓలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే, రుణగ్రస్తుల గత ఐదేళ్ల లావాదేవీలను క్షుణ్నంగా పరిశీలించాలని ఆయన సూచించారు. అవసరమైతే, బ్యాంక్‌లు ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కూడా నిర్వహించాలని పేర్కొన్నారు.  

తనిఖీల్లో వెల్లడవుతున్న అవకతవకలు...
భూషణ్‌ స్టీల్‌ ప్రమోటర్‌ చేసినట్లే పలు కంపెనీల ప్రమోటర్లు కూడా బ్యాంక్‌ రుణాల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని మరో ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ అవకతవకల కోసం సదరు ప్రమోటర్లు తమ కంపెనీల అనుబంధ కంపెనీలను వినియోగించుకున్నారనడానికి ఆధారాలున్నాయని పేర్కొన్నారు.

రుణ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న కంపెనీల ఖాతా పుస్తకాలను ఎస్‌ఎఫ్‌ఐఓ తనిఖీ చేస్తోందని వివరించారు. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా దివాలా కంపెనీలపై విస్తృతమైన ఆడిటింగ్‌ జరుగుతోందని,  ఈ తనిఖీల్లో పలు ఆర్థిక పరమైన అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు.  

ఎస్‌ఎఫ్‌ఐఓకు మరిన్ని అధికారాలు...
భారత బ్యాంక్‌లు ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు మొండి బకాయిల సమస్యతో సతమతమవుతున్నాయి.  మొత్తం మొండి బకాయిలు రూ.8 లక్షల కోట్లకు పెరిగాయని అంచనా. వీటికి తోడు పలు బ్యాంక్‌ రుణాలకు సంబంధించి మోసాలు, కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయి. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన విషయం తెలిసిందే.  కాగా గత ఏడాది జూన్‌లో ఆర్‌బీఐ 12 ఒత్తిడి ఖాతాలను గుర్తించింది. ఒక్కో ఖాతాలో రూ.5,000 కోట్లకు మించిన రుణాలున్నాయి.

ఇన్‌సాల్వెన్సీ బ్యాంక్‌ రప్టసీ కోడ్‌(ఐబీసీ) కింద తక్షణం చర్యలు చేపట్టిన మొత్తం బ్యాంక్‌ల మొండి బకాయిల్లో  ఈ మొత్తం 12 ఖాతాల రుణాలు...  నాలుగోవంతు వరకూ ఉంటాయని అంచనా. ఇక అదే ఏడాది డిసెంబర్‌లో మొండి బకాయిలకు సంబంధించి 28 కంపెనీలతో కూడిన మరో జాబితాను ఆర్‌బీఐ వెల్లడించిన విషయం తెలిసిందే.

కంపెనీల చట్టం  కింద మోసాలకు, వైట్‌ కాల ర్‌ నేరాలకు పాల్పడిన వారిని విచారించే  ఎస్‌ఎఫ్‌ఐఓకు ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో మరిన్ని అధికారాలు ఇచ్చింది. కంపెనీ చట్టం ఉల్లంఘనకు పాల్పడిన వారిని అరెస్ట్‌ చేసే అధికారాన్ని ఎస్‌ఎఫ్‌ఐఓకు కేంద్రం ఇచ్చింది. కాగా ఇప్పటివరకూ ఐబీసీ కింద నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) 655 కేసుల్లో నిర్ణయం తీసుకుంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top