దోమ కుట్టకుండా.. రూ.6 వేల కోట్లు!!

Cost of the government for mosquito breeding 6 thousand crores - Sakshi

మార్కెట్లోకి కొత్త నివారణ ఉత్పత్తులు

ఐదు కంపెనీల పోటాపోటీ

80 శాతం వాటా ఈ సంస్థలదే  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇళ్లలో దోమల నివారణకు ఏటా దేశవ్యాప్తంగా జనం పెడుతున్న ఖర్చెంతో తెలుసా? అక్షరాలా ఆరువేల కోట్ల రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జనాన్ని దోమలు ఎంతలా భయపెడుతున్నాయో చెప్పటానికి ఈ అంకెలు చూస్తే చాలు. అయితే ఇదంతా ఇళ్లలో దోమల నివారణ ఉత్పత్తుల కోసం జనం చేస్తున్న ఖర్చు మాత్రమేనండోయ్‌!!. ఇక  కార్యాలయాలు, షాపులు, వాణిజ్య సముదాయాలు, వీధుల్లో ప్రభుత్వ సంస్థలు చేస్తున్న వ్యయం దీనికి అదనం. దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణకయ్యే ఆసుపత్రి ఖర్చులు, వాటికోసం వాడే మందులు ఈ లెక్కలోకి రావటం లేదు. ఎందుకంటే మలేరియా, డెంగ్యూ, చికున్‌ గున్యాతోపాటు కొత్తగా జికా, వెస్ట్‌ నైల్‌ వంటి  వైరస్‌ల వ్యాప్తికి దోమలు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు ఎందరో!!. అందుకే దోమల నివారణకు ఇళ్లలో లిక్విడ్‌ వేపరైజర్స్, ఏరోసోల్స్, ఇన్సెన్స్‌ స్టిక్స్,  క్రీములు, మ్యాట్స్, ఆయిల్స్‌ వంటి ఉత్పత్తులు వినియోగిస్తున్నారు.  

సగం కుటుంబాల్లో.. 
దోమల నివారణ ఉత్పత్తులు ఇప్పుడు పల్లెలకూ పాకాయి. కిరాణా దుకాణాలు, జనరల్‌ స్టోర్స్, మందుల షాపుల్లో విరివిగా లభిస్తున్నాయి. అటు కంపెనీలు సైతం విభిన్న రకాల్లో వీటిని తయారు చేస్తూ కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. బ్రాండెడ్‌ కంపెనీలు ఈ ఉత్పత్తుల తయారీకి ఏళ్ల తరబడి శ్రమిస్తున్నాయి. పరిశోధన, పరీక్షల అనంతరం వీటిని విడుదల చేస్తున్నాయి. భారత్‌లో 28 కోట్ల కుటుంబాల్లో.. 13.4 కోట్ల కుటుంబాలు అన్‌ బ్రాండెడ్‌ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు గోద్రెజ్‌ కన్సూ్యమర్‌ ప్రొడక్ట్స్‌ ఇండియా, సార్క్‌ సీఈవో సునీల్‌ కటారియా చెప్పారు. దేశంలో చిన్నాచితకా యూనిట్లు తయారు చేసిన నకిలీ ఇన్సెన్స్‌ (అగర్‌బత్తీలు) వ్యాపారం ఏటా రూ.500 కోట్లు ఉంటోందని ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఇక కాయిల్స్‌ చవకగా దొరుకుతాయి కాబట్టి వీటికి ఎక్కువ గిరాకీ ఉంటోందని వెల్లడించారు. బ్రాండెడ్‌ కంపెనీల కాయిల్స్‌ వ్యాపారం    రూ.2,220 కోట్లుగా ఉంది.  

ఇదీ భారత మార్కెట్‌.. 
దేశవ్యాప్తంగా ఇళ్లలో వాడుతున్న దోమల నివారణ ఉత్పత్తుల మార్కెట్‌ రూ.6,000 కోట్లు. ఏటా ఈ మార్కెట్‌ 10 శాతం వృద్ధి చెందుతోంది. వీటిలో కాయిల్స్‌ వాటా అత్యధికంగా 37 శాతం ఉంది. లిక్విడ్‌ వేపరైజర్స్‌ 34 శాతం, ఏరోసోల్స్‌ 14, ఇన్సెన్స్‌ స్టిక్స్‌ 11 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. మిగిలిన వాటాను క్రీములు, మ్యాట్స్, ఆయిల్స్‌ వంటి ఉత్పత్తులు దక్కించుకున్నాయి. చిత్రమేంటంటే వీటన్నిటిలో టాప్‌–5 బ్రాండ్స్‌ ఏకంగా 80 శాతం మార్కెట్‌ను చేజిక్కించుకున్నాయి. దోమల నివారణ ఉత్పత్తుల రంగంలో గోద్రెజ్‌ కన్సూ్యమర్‌ ప్రొడక్ట్స్, ఎస్‌సీ జాన్సన్, రెక్కిట్‌ బెన్‌కిసర్, జ్యోతి ల్యాబొరేటరీస్, డాబర్‌లు అగ్రశ్రేణి కంపెనీలుగా కొనసాగుతున్నాయి. గోద్రెజ్‌కు చెందిన గుడ్‌నైట్‌ బ్రాండ్‌ ఏటా రూ.2,500 కోట్ల వ్యాపారాన్ని చేస్తూ టాప్‌ వన్‌ స్థానంలో ఉంది 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top