ఎన్నికల ఏడాది.. ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించాలా ?

Continue Investments in election year? - Sakshi

నేను కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. వచ్చే ఏడాది ఎన్నికల జరగనున్నందున సెన్సెక్స్‌ 33,000–35,000 రేంజ్‌లో కదలాడుతుందని, స్టాక్‌ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉంటాయని  అంచనా వేస్తున్నాను. ఈ కారణంగా నా ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రాబడులు ఏవిధంగా ఉంటాయి ? –రాజు, విశాఖపట్టణం  
ఇది చాలా ప్రాముఖ్యమైన సందేహం. అలాగే సమాధానం చెప్పడానికి అత్యంత కష్టమైన ప్రశ్న కూడా. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అయితే మీరు ఎంత కాలం ఇన్వెస్ట్‌ చేస్తారు అనే విషయాన్ని బట్టి ఎన్నికల సంవత్సరం అనే అంశం నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఉదాహరణకు మీరు ఐదేళ్లు, అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారనుకుందాం. ఎన్నికలు మరో ఏడాదిలో వస్తాయి. కాబట్టి స్టాక్‌ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయని మీరు అంచనా వేస్తున్నారు. అందుకని మీరు సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌)లను కొనసాగించవచ్చు.

మీ అంచనాలకు అనుగుణంగా స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులకు గురైతే, మీకు ప్రయోజనమే కలుగుతుంది. ఒకవేళ మీరు ఐదేళ్ల కంటే తక్కువ కాలానికే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, ఇది కొంచెం ఆందోళన కలిగించే అంశమే. మీరు  ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం ఈక్విటీని అసలు పరిగణించాల్సిన అవసరమే లేదు. మీరు ఇప్పటికే ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లయితే, స్టాక్‌ మార్కెట్లో ఎప్పుడూ ఒకే పరిస్థితి లేదా పరిస్థితులు ఒకేలా ఉండవన్న విషయం మీకు అర్థమై ఉంటుంది. మార్కెట్‌ చుట్లూ ఎప్పుడు టెన్షన్స్‌ ఉంటూనే ఉంటాయి. ఒకసారి చమురు ధరలు, మరోసారి ద్రవ్యోల్బణ ఒత్తిడులు. ఇలా రకరకాల ఒత్తిడులు మార్కెట్‌పై ఉంటాయి.

అయితే స్టాక్‌ మార్కెట్‌కు సంబంధించి గత 20–25 ఏళ్ల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, కనీసం నాలుగు నుంచి ఐదేళ్ల పాటు ఈక్విటీలో ఇన్వెస్ట్‌ చేస్తే, స్థిరాదాయ సాధనాల కంటే ఎక్కువ రాబడులే ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ నుంచి పొందవచ్చు. అంతేకాకుండా ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులను కూడా ఈక్విటీలు ఇస్తాయి.  స్వల్పకాలంలో మార్కెట్‌ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. దీర్ఘకాలంలో.. కనీసం ఐదేళ్లు అంతకు మించిన కాలానికి మాత్రం ఈక్విటీల రాబడులు భేషుగ్గా ఉంటాయని చెప్పవచ్చు.  

నేను ప్రతినెలా ఒక యూనిట్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌(ఈక్విటీ ట్రేడెడ్‌ ఫండ్‌)ను కొనుగోలు చేయాలనుకుంటున్నాను. ఇలా పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. మంచి గోల్డ్‌ ఈటీఎఫ్‌ను ఎలా ఎంచుకోవాలి?  
–జయరామ్, నెల్లూరు  
మంచి గోల్డ్‌ ఈటీఎఫ్‌ను ఎంచుకోవడానికి మీకు నిపుణుల సలహా అవసరం లేదు. ఎందుకంటే గోల్డ్‌ ఈటీఎఫ్‌ల డిజైన్‌ చాలా సరళంగా ఉంటుంది. పుత్తడి ధరలను బట్టే గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ధరలను నిర్ణయిస్తారు. ఈ ధరలకు వ్యయాలు అదనం. అయితే ఈ వ్యయాలు చాలా స్వల్పంగా ఉంటాయి. అయితే మీరు పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు ప్రత్యామ్నాయంగా మరో మార్గం ఉంది. మీరు డెట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి.

దీనికి అదనంగా ప్రభుత్వం అప్పుడప్పుడు జారీ చేసే సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌(ఎస్‌జీబీ)లను కొనుగోలు చేయండి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసినా, లేదా గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేసే గోల్డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసినా, కొన్ని వ్యయాలు మాత్రం మీరు భరించాల్సి ఉంటుంది. అదే సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌లో ఇలాంటి వ్యయాల భారం ఉండదు. పైగా ఈ సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌పై మీకు ఏడాదికి 2.5 శాతం వడ్డీ కూడా వస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ గోల్డ్‌ బాండ్స్‌ను అప్పటి పుత్తడి ధర ప్రకారం రిడీమ్‌ చేసుకోవచ్చు  

నా వయస్సు 53 సంవత్సరాలు. నేను 65 ఏళ్ల వరకూ పనిచేయగలను. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ల ద్వారా ఇప్పటివరకూ నేను రూ.50 లక్షలు పొదుపు చేయగలిగాను. రిటైర్మెంట్‌ అవసరాల కోసం ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నెలకు రూ.40,000– 50,000 చొప్పున సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయాలనేది నా ఆలోచన. నా ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళిక ఎలా ఉండాలి ?
–ఈశ్వరరావు, హైదరాబాద్‌
జ: మీ అత్యవసరాలకు సరిపడా మొత్తాన్ని మాత్రమే స్థిరాదాయ సాధనాల్లో  ఉంచుకోవాలి. ఇలాంటి స్థిరాదాయ సాధనాల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు ఒకటి. వీటిపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుంది. మూలం వద్ద పన్ను కోత(టీడీఎస్‌) ఉంటుంది. దీనికి బదులుగా ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. మీరు మరో పన్నేండేళ్లు పనిచేస్తారు. కాబట్టి, ఈ పన్నేండేళ్లు మీరు ఇన్వెస్ట్‌ చేయగలుగుతారు. పన్నేండేళ్లు అంటే దీర్ఘకాలం కిందే లెక్క.

ఈ విషయాలన్ని పరిగణనలోకి తీసుకుంటే మీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళిక ఎలా ఉండాలంటే..., మీ అత్యవసరాలకు సంబంధించిన మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ లేదా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయండి. రెండు నుంచి మూడేళ్ల పాటు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్, ఈక్విటీ ఫండ్స్‌లో రాబడులు మీరు ఆశించిన స్థాయిలో లేకపోయినా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. రానురాను ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌ రాబడులు కంటే ఈక్విటీ ఫండ్స్‌ రాబడులు అధికంగా ఉంటాయనే విషయం మీకు అర్థమవుతుంది.  

- ధీరేంద్ర కుమార్‌ ,సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top