
భారత రోడ్లమీద చైనా కార్ల పరుగులు!
మొదట చైనా బొమ్మలు, తర్వాత చైనా ఫోన్లు.. ఇప్పుడు చైనా కార్లు కూడా వచ్చేస్తున్నాయి. అవును... మన దేశంలోకి త్వరలోనే చైనా కార్లు రంగప్రవేశం చేయబోతున్నాయి.
► మారుతి సుజుకీ, హ్యుందయ్‌పై పోటీకి సిద్ధం
► మహారాష్ట్రతో ఒప్పందాలు కుదుర్చుకున్న చైనా కంపెనీలు
► ఇండియాలో ప్రవేశానికి ధరలు నిర్ణయిస్తున్న ఎస్ఏఐసీ మోటార్స్
న్యూఢిల్లీ:
మొదట చైనా బొమ్మలు, తర్వాత చైనా ఫోన్లు.. ఇప్పుడు చైనా కార్లు కూడా వచ్చేస్తున్నాయి. అవును... మన దేశంలోకి త్వరలోనే చైనా కార్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. అక్కడ ఇప్పటికే పేరొందిన పెద్ద పెద్ద కార్ల కంపెనీలన్నీ భారతదేశంలో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. చైనాలో ఎస్‌యూవీ మోడళ్లను ఉత్పత్తి చేసే అతి పెద్ద కంపెనీలైన పేరొందిన ఎస్ఏఐసీ (షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కార్పొరేషన్), గ్రేటర్ వాల్ మోటార్ తమ కార్లను భారతదేశానికి తెచ్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించాయి.
భారత్‌లో కాస్త ఆలస్యంగా ప్రవేశించిన ఫోక్స్ వ్యాగన్ ఏజీ, ఫోర్డ్ మోటార్, జనరల్ మోటార్స్ లాంటి సంస్థలు ఇక్కడ వినియోగదారులకు అనుకూలంగా ఉండే ధరలు నిర్ణయించకపోవడంతో అవి వచ్చి పదేళ్లు అవుతున్నా.. ఇంకా బాలారిష్టాల్లోనే ఉన్నాయి. అంతకుముందే భారత్‌లో ప్రవేశించిన చైనా కార్లు కూడా నాణ్యత బాగోలేక నష్టాలనే చవిచూశాయి. ఈ అనుభవంతో భారత వినియోగదారులకు అందుబాటులో ధరలు నిర్ణయించి, క్వాలిటీని పెంచుకుని దేశీయ కార్ల కంపెనీలు మారుతీ సుజుకీ, హ్యుండాయ్ మోటార్స్ అమ్మకాలను అధిగమించి వాటికి పోటీగా నిలవాలని తాజాగా చైనా కంపెనీలు నిర్ణయించాయి.
2020కల్లా భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్‌గా రూపుదిద్దుకోనుంది. ఈ క్రమంలో చైనా కంపెనీలు ఇక్కడ రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. దక్షిణ భారతదేశంలో కూడా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇటీవల ఎస్ఏఐసీ, గ్రేట్ వాల్ కంపెనీలు మహారాష్ట్ర ప్రభుత్వానితో మాటామంతీ జరిపాయి. పుణేలో ఆటోహబ్ ఏర్పాటు చేయబోతున్నట్టు ఆ రాష్ట్ర పరిశ్రమల మంత్రి కూడా వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో పుణేతో పాటు మరికొన్ని నగరాల్లో తమ ఆటో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఎస్ఏఐసీ ప్రకటించింది. భారత్ కార్ల మార్కెట్ అతి పెద్దదని తెలిపింది. ఏ రకమైన మోడళ్లను ఇక్కడ ప్రవేశపెట్టాలి, భారత వినియోగదారులకు అనుగుణంగా ఏ ధరలు నిర్ణయించాలనే పనిలో ఎస్ఏఐసీ ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుతం గుజరాత్‌లో జనరల్ మోటార్స్ నడుపుతున్న హలాల్ ప్లాంటును కొనుగోలు చేసేందుకు ఎస్ఏఐసీ సిద్ధమైంది. ఒప్పందం ప్రకారం జూన్ చివరినాటికి ఈ ప్లాంటు ఆపరేషన్స్ మూతపడనున్న క్రమంలో, ప్లాంటు అమ్మడానికి అనువైన మార్గాలను వెతుకుతున్నట్లు జనరల్ మోటార్స్ వెల్లడించింది. ఫిబ్రవరి 12న భారత్‌లో అట్టహాసంగా జరిగిన అతిపెద్ద ఆటో ఎక్స్‌పోకు గ్రేట్ వాల్ నుంచి 12 మంది ప్రతినిధులు వచ్చారు. ఇక్కడ కార్ల మార్కెట్, ప్రభుత్వ విధానాలపై సర్వేలు నిర్వహించారు. ఆ కంపెనీ బోర్డు డైరెక్టర్లు ఏకగ్రీవంగా భారత్‌లో అనుబంధ కార్ల ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది.
ఇదంతా చూస్తుంటే డ్రాగన్ కార్లు త్వరలోనే భారతదేశంలో రోడ్ల మీద పరుగులు తీయడం ఖాయమనే తెలుస్తోంది. చైనా తయారీ స్మార్ట్ ఫోన్ల మీద మొదట్లో కొన్ని అనుమానాలు వ్యక్తమైనా, తర్వాతి కాలంలో ఆ ఫోన్లకు ఇక్కడ మంచి ఆదరణ లభించింది. ఇతర కంపెనీల ఫోన్లతో సమానంగా ఉండే ఫీచర్లతో.. వాటి ధరల్లో దాదాపు సగానికే అందుబాటులో ఉండటంతో వీటిని బాగానే కొన్నారు. ఇప్పుడు ఈ కార్లు కూడా అలాగే ఉంటాయా, లేక ఇతర విదేశీ కంపెనీల్లా పెద్దగా మనుగడ సాధించలేవా అన్న విషయం తెలియాలంటే మాత్రం కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.