చార్జింగ్‌ స్టేషన్లకు లైసెన్సులు అక్కర్లేదు

Charging stations do not have licenses - Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనాలపై విద్యుత్‌ శాఖ ప్రకటన

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా లైసెన్సు అవసరం లేకుండానే ఈ–వాహనాల చార్జింగ్‌ స్టేషన్లను నిర్వహించవచ్చని కేంద్ర విద్యుత్‌ శాఖ స్పష్టం చేసింది. సాధారణంగా విద్యుత్‌ సరఫరా, పంపిణీ, ట్రేడింగ్‌ మొదలైన వాటికి ఎలక్ట్రిసిటీ చట్టం కింద లైసెన్సు తీసుకోవడం తప్పనిసరి. ఆ ప్రకారంగా చూస్తే వినియోగదారులకు విద్యుత్‌ను విక్రయించే సంస్థలన్నీ కూడా లైసెన్సులు తీసుకోవాల్సిందే.

అయితే, బ్యాటరీల చార్జింగ్‌ను సేవల విభాగం కింద వర్గీకరించడం ద్వారా కేంద్రం ఈ మేరకు నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించింది. బ్యాటరీలను చార్జింగ్‌ చేయడంలో సదరు చార్జింగ్‌ స్టేషన్‌.. ఎటువంటి సరఫరా, పంపిణీ, ట్రేడింగ్‌ కార్యకలాపాలు నిర్వహించదు కనుక లైసెన్సు అవసరం ఉండదని విద్యుత్‌ శాఖ తెలిపింది.  ఇది పురోగామి చర్యగా.. ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థల సొసైటీ (ఎస్‌ఎంఈవీ) డైరెక్టర్‌ సొహిందర్‌ గిల్‌ అభివర్ణించారు.

ప్రధాన సవాలైన చార్జింగ్‌ వ్యవస్థకు సంబంధించి ఆటంకాలు తొలగించిన విధం గానే, ఇతరత్రా స్థల సమీకరణ మొదలైన సమస్యల పరిష్కారంపై కూడా దృష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. త్వర లో ఎలక్ట్రిక్‌ వాహనాల నియంత్రణ, సాంకేతిక ప్రమాణాలు మొదలైన వాటికి సంబంధించి ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి అర్‌కే సింగ్‌ గత నెలలో వెల్లడించారు. బ్యాటరీల చార్జింగ్‌కు టారిఫ్‌ ప్రతి యూనిట్‌కు రూ. 6 చొప్పున అందుబాటు స్థాయిలో ఉంచే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. 2030 నాటికల్లా దేశీయంగా 100% ఎలక్ట్రిక్‌ వాహనాలే ఉండాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top