చందా కొచర్, ధూత్‌  నివాసాల్లో ఈడీ సోదాలు 

Chanda Kochhar, Videocon Venugopal Dhoot Homes Searched In Loan Case - Sakshi

వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణాల కేసులో దర్యాప్తు 

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రూ. 1,875 కోట్ల రుణాలిచ్చిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు వేగవంతం చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈవో చందా కొచర్‌తో పాటు వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ నివాసాల్లో శుక్రవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. దక్షిణ ముంబైలోని కొచర్‌ నివాసంలో, ఔరంగాబాద్‌లోని ధూత్‌ నివాసంలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా మనీల్యాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ.. కొచర్‌ నివాసంలో సోదాలు చేయడం ఇదే తొలిసారి. సీబీఐ ఇప్పటికే ముంబైలోని నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది.  

ప్రైవేట్‌ కంపెనీలకు మంజూరు చేసిన రుణాల విషయంలో చందా కొచర్‌పై ఐసీఐసీఐను మోసగించడం, క్రిమినల్‌ కుట్ర ఆరోపణలు ఉన్నాయి. కన్సార్షియంలో భాగంగా వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ ఇచ్చిన రుణాల్లో అవకతవకలేమైనా జరిగాయా అన్న కోణంలో జరిగిన ప్రాథమిక విచారణ (పీఈ) అనంతరం చందా కొచర్, ఆమె భర్త దీపక్‌ కొచర్, వీడియోకాన్‌ గ్రూప్‌ అధికార్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. దీనిపై ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏర్పాటు చేసిన జస్టిస్‌ బీఎన్‌ శ్రీకృష్ణ కమిటీ కూడా వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల మంజూరీలో చందా కొచర్‌ బ్యాంక్‌ నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంక్‌ రుణాల మంజూరీలో చందా కొచర్‌ పాత్ర కూడా ఉండటం, ఆ తర్వాత ఆమె భర్త దీపక్‌కి చెందిన న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌లో ధూత్‌ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడవటంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. వీడియోకాన్‌ గ్రూప్‌కి ఇచ్చిన రుణాలు మొండిబాకీలుగా మారాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top