నీరవ్‌ మోదీ తరహాలో మరో బ్యాంక్‌కు టోకరా!! | Sakshi
Sakshi News home page

నీరవ్‌ మోదీ తరహాలో మరో బ్యాంక్‌కు టోకరా!!

Published Sat, May 12 2018 1:03 AM

CBI Files Case Against Timber Firm - Sakshi

న్యూఢిల్లీ: నీరవ్‌ మోదీ సంస్థలు పీఎన్‌బీని మోసగించిన తరహాలోనే ఓ టింబర్‌ కంపెనీ ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ను(ఓబీసీ) ఏకంగా రూ.155 కోట్లకు మోసం చేసింది. దీనిపై ఓబీసీ ఫిర్యాదు చేయటంతో... సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. హరియాణాలోని కర్నాల్‌ కేంద్రంగా పనిచేసే మహేష్‌ టింబర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్లు అశోక్‌ మిట్టల్, ఆయన భార్య నిషా మిట్టల్‌తోపాటు ఓబీసీ నుంచి తొలగింపునకు గురైన సీనియర్‌ అధికారి సురేందర్‌కుమార్‌ రంగాపై కేసు కూడా నమోదు చేసింది.

మహేష్‌ టింబర్‌ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్‌కు సింగపూర్‌ కేంద్రంగా మహేష్‌ టింబర్‌ (సింగపూర్‌) లిమిటెడ్‌ అనే కంపెనీ ఉంది. ఈ సంస్థ ‘స్టాండ్‌బై లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌’ల ఆధారంగా ఎస్‌బీఐ, ఓబీసీ, బీఓబీ ఆధ్వర్యంలోని కన్సార్షియం నుంచి 2017 ఏప్రిల్‌ నాటికి రూ.242 కోట్ల రుణాలను తీసుకుంది. రూ.12 కోట్ల రుణ సదుపాయాన్ని ఈ సంస్థ మోసపూరితంగా రూ.108.11 కోట్లుగా మార్చివేసినట్టు గుర్తించారు. బ్యాంకు సిబ్బంది సాయంతో ఫారిన్‌ లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌లలో (ఎఫ్‌ఎల్‌సీ) మార్పులు చేసి భారీగా రుణాలను పొందారు.

కానీ వాటిని తిరిగి చెల్లించలేదు. అంతర్జాతీయ బ్యాంకింగ్‌ సందేశాలను ఉపయోగించుకుని, బ్యాంకు పుస్తకాల్లో పేర్కొనకుండా ఈ మోసం జరిగిన తీరు రూ.13,000 కోట్ల నీరవ్‌ మోదీ స్కామ్‌ను తలపిస్తోంది. మహేష్‌ టింబర్‌కు బ్యాంకులు ఇచ్చిన రూ.242 కోట్ల అసలు రుణాల్లో, ఓబీసీ ఇచ్చిన మొత్తం రూ.155.21 కోట్లు. మహేష్‌ టింబర్‌కు జారీ అయిన రుణాలను 2016 సెప్టెంబర్‌ 26న ఎన్‌పీఏగా గుర్తించినట్టు ఓబీసీ తన ఫిర్యాదులో తెలిపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement