బ్యాంకులకు ‘బ్యాడ్‌ టైమ్‌’ ముగిసినట్టే!

Care ratings opinion on banking - Sakshi

కేర్‌ రేటింగ్స్‌ అభిప్రాయం

సెప్టెంబర్‌ క్వార్టర్లో తగ్గుముఖం పట్టిన ఎన్‌పీఏలు

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్‌ రంగాన్ని కుదిపేస్తున్న మొండి బకాయిల (ఎన్‌పీఏ) సమస్య ముగిసినట్టేనా...? బ్యాంకుల బాధలు తీరినట్టేనా...? అవుననే అంటోంది ప్రముఖ రేటింగ్స్‌ సంస్థ కేర్‌. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌కు (జూలై–సెప్టెంబర్‌) సంబంధించి బ్యాంకులు ఇప్పటి వరకు వెల్లడించిన ఫలితాలను గమనిస్తే ఎన్‌పీఏల పరంగా దారుణ శకం ముగిసి ఉండొచ్చంటోంది.

మొండి బకాయిల పెరుగుదల గణనీయంగా తగ్గినట్టు గణాంకాలను చూస్తే తెలుస్తోందని కేర్‌ రేటింగ్స్‌ వ్యాఖ్యానించింది. 2016–17 సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఎన్‌పీఏల పెరుగుదల 105 శాతంగా నమోదైతే... ప్రస్తుత ఆర్థిక సంవవ్సరం (2017–18) సెప్టెంబర్‌ క్వార్టర్లో ఎన్‌పీఏలు కేవలం 26.3 శాతంగానే పెరగడాన్ని నిదర్శనంగా కేర్‌ తన పరిశోధనా నివేదికలో పేర్కొంది.

ప్రైవేటులో పెరిగాయి...!
ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మాత్రం ఎన్‌పీఏలు పెరిగాయి. ఆర్‌బీఐ వార్షిక ఆడిట్ల వల్ల ఖాతాల్లో వ్యత్యాసాలను అవి తప్పనిసరిగా చూపించాల్సి రావడం దీనికి కారణమని కేర్‌ తెలిపింది. ప్రభుత్వరంగ బ్యాంకులను పరిశీలిస్తే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఎన్‌పీఏలు రూ.6,649 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు తగ్గిపోయాయి.

కెనరా బ్యాంకు ఎన్‌పీఏలు అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.5,511 కోట్ల నుంచి రూ.3,367 కోట్లకు దిగొచ్చాయి. యూనియన్‌ బ్యాంకు ఎన్‌పీఏలు అంతకుముందు ఏడాది ఇదే కాలంలో పోల్చి చూస్తే రూ.4,453 కోట్ల నుంచి రూ.2,686 కోట్లకు క్షీణించాయి. మొండి బకాయిలు పెరిగిపోతున్న దృష్ట్యా బ్యాంకులు అనుసరించిన అప్రమత్తత విధానమే దీనికి కారణమై ఉండొచ్చని కేర్‌ రేటింగ్స్‌కు చెందిన అనలిస్ట్‌ మదన్‌ సబ్నావిస్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పెరుగుతున్న కేటాయింపులు
మరోవైపు మొండి బాకీలకు నిధుల కేటాయింపులు (ప్రొవిజన్స్‌) పెరిగిన దృష్ట్యా ఎన్‌పీఏల గుర్తింపు కొనసాగుతున్నట్టు కేర్‌ రేటింగ్స్‌ పేర్కొంది. గణాంకాల ప్రకారం ఎన్‌పీఏలకు కేటాయింపులు పెరుగుతున్నప్పటికీ, అది సెప్టెంబర్‌ క్వార్టర్లో 13.6 శాతమేనని, గతేడాది ఇదే కాలంలో ఉన్న 13.8 శాతం కేటాయింపుల కంటే తక్కువేనని కేర్‌ వివరించింది. అయితే, ఇప్పటికీ గత కాలంలో పోలిస్తే ఎన్‌పీఏల శాతం ఎక్కువగానే ఉన్నట్టు తెలియజేసింది.

2015–16 రెండో క్వార్టర్లో 4.1 శాతం, 2016–17లో 7.6 శాతం కంటే 2017–18లో ఎన్‌పీఏల రేషియో 8.7 శాతంగా ఉన్నట్టు వెల్లడించింది. దేశీయ బ్యాంకింగ్‌ రంగం రూ.8 లక్షల కోట్ల ఎన్‌పీఏల భారాన్ని మోస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని కేసులు దివాళా పరిష్కార చట్టం పరిధిలోకి రానుండడంతో డిసెంబర్‌ క్వార్టర్లో ఎన్‌పీఏల పెరుగుదల, వాటికి అధిక కేటాయింపుల భారం ఉండొచ్చని కేర్‌ అంచనా వేసింది.

‘‘చాలా వరకు మధ్య స్థాయి ప్రభుత్వరంగ బ్యాంకుల పరంగా చెడ్డ కాలం ముగిసినట్టేనని మా అంచనా. ఇది బ్యాం కింగ్‌ రంగానికి ఆశాజనకం. మొండి బకాయిలుగా మారే రుణా లు క్రమంగా తగ్గిపోవడాన్ని చూడొచ్చు’’ అని ఎస్‌ఎంసీ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ అనలిస్ట్‌ సిద్ధార్థ్‌ పురోహిత్‌ చెప్పారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top