ఈసారి ఇలా ప్లాన్ చేద్దాం.. | Sakshi
Sakshi News home page

ఈసారి ఇలా ప్లాన్ చేద్దాం..

Published Sat, Apr 19 2014 11:36 PM

ఈసారి ఇలా ప్లాన్ చేద్దాం.. - Sakshi

 అనిల్ రెగో
 సీఈవో, రైట్ హొరెజైన్స్
  ఎటువంటి ఇబ్బంది, ఒత్తిడి లేకుండా ఎంచుకున్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవాలంటే చక్కటి ప్రణాళిక అవసరం. మనలో చాలామంది లక్ష్యాలను నిర్దేశించుకున్నా సరైన అవగాహన, ప్రణాళికలు లేక విఫలమవుతుంటారు. కొన్ని అంశాలను తు.చ. తప్పకుండా పాటిస్తే భవిష్యత్తు ఆర్థిక అవసరాలపై నిశ్చింతగా ఉండొచ్చు.

 

బడ్జెట్‌తో మొదలు పెట్టాలి..
 ఆర్థిక ప్రణాళికలో అత్యంత కీలకమైన అంశం బడ్జెట్ రూపకల్పన. మీ మొత్తం ఆదాయం, ఖర్చులు, ఆర్థిక లక్ష్యాల కాలపరిమితి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వృథా ఖర్చులు తగ్గించి నెలవారీ ఆదాయంలో పొదుపు కోసం కొంత మొత్తం కేటాయించాలి. ఆదాయ, వ్యయాలను ఏ నెలకు ఆ నెల సమీక్షించుకునే వాళ్లు ప్రతీ ఏడాది ఆర్థిక ప్రణాళికలో విజయం సాధిస్తారు. అనవసర వ్యయాలను తగ్గించి, దీర్ఘకాలం పొదుపు చేయడానికి బడ్జెట్ దోహదం చేస్తుంది.

 పథకాల ఎంపికా ముఖ్యమే...
 పొదుపు విషయానికి వస్తే ఎంచుకున్న పథకాలపైనే ఆర్థిక విజయం ఆధారపడి ఉంటుంది. సరైన పథకంలో పెడితేనే అది వృద్ధి చెంది ఆర్థిక ఫలాలను అందించగలుగుతుంది. మీ దగ్గర ఉన్న అదనపు మొత్తాన్ని అనవసరంగా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉంచకుండా వాటిని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్, మ్యూచువల్, గోల్డ్ ఫండ్స్ వంటి అధిక రాబడిని ఇచ్చే పెట్టుబడి సాధనాలకు కేటాయించండి.

 ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్లు, డెట్ ఫండ్స్ అధిక రాబడులను అందిస్తున్నాయి. బ్యాంకు డిపాజిట్లు అయితే 9% వడ్డీని ఇస్తున్నాయి. ఇంతకంటే కొద్దిగా రిస్క్ చేయగలిగితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ విధానంలో ఈక్విటీ సేవింగ్స్ స్కీం (ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్ -ఈఎల్‌ఎస్‌ఎస్) చక్కటి ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా చెప్పొచ్చు.

 వీటిల్లో మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉండటం వల్ల ఫండ్ మేనేజర్లు దీర్ఘకాలంలో మంచి రాబడి ఇవ్వడానికి అవకాశం ఉన్న షేర్లలో ఇన్వెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది. అలాగే సిప్ విధానం ఎంచుకోవడం వల్ల మార్కెట్ కదలికలపై ఆందోళన ఉండదు. మార్కెట్ పడితే మన చేతికి ఎక్కువ యూనిట్లు వస్తాయి. అదే పెరుగుతుంటే మనం ఇన్వెస్ట్ చేసిన మొత్తం కూడా పెరుగుతుంది.

 ఇన్వెస్ట్‌మెంట్ సాధనం ఎంచుకోవడంలో ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం వంటి అంశాలు చాలా కీలకమైనవి. ఉదాహరణకు మీ అమ్మాయి/అబ్బాయికి విదేశాల్లో ఉన్నత చదువు చెప్పించడం మీ లక్ష్యం అనుకుందాం. ఇలాంటి స్థిరమైన లక్ష్యాలున్నప్పుడు రిస్క్ తక్కువగా ఉండి స్థిరమైన ఆదాయాన్నిచ్చే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వంటి పథకాలు ఉత్తమం. ఇవి రాబడితో కూడిన స్థిరమైన ఆదాయాన్ని ఇవ్వడమే కాకుండా, వడ్డీపై పన్ను భారమూ ఉండదు.

 సకాలంలో బకాయిలు
 ఏమైనా బకాయిలు ఉంటే వాటిని సకాలంలో చెల్లించండి. రుణాలు, ఆదాయపు పన్ను, ఇతర చెల్లింపులు ఏమైనా సరే అశ్రద్ధ చేయొద్దు. బకాయిలు సకాలంలో చెల్లించకపోతే అది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. క్రెడిట్ రేటింగ్ తగ్గడంతోపాటు ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీస్తుంది. క్రెడిట్ రేటింగ్ పడిపోతే తీసుకునే రుణాలపై అధిక వడ్డీరేట్లు చెల్లించాల్సి వస్తుంది.

 అత్యవసర నిధి అవసరమే
 బడ్జెట్ తయారీలో ఇది చివరి అంశమే అయినప్పటికీ ఇదే చాలా కీలకమైనది. ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్‌లో అత్యవసర నిధికి కొంత మొత్తం కేటాయించాలి. ఏ క్షణంలో ఎప్పుడు డబ్బులు అవసరమవుతాయో తెలియదు కాబట్టి అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.

 ఉదాహరణకు ఉద్యోగం పోతే కొత్తది వెతుక్కునే లోపు కనీసం ఇంటి అవసరాలు, ఈఎంఐలు చెల్లించడానికి సరిపోయే విధంగా ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి.

లక్ష్యం చేరుకుందామిలా...
- ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రణాళికను ప్రారంభించండి.
- రిస్క్ సామర్థ్యం, ఆర్థిక లక్ష్యం ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్ సాధనం ఎంచుకోవాలి
- ముందుగానే బడ్జెట్ తయారు చేసుకొని, దానికి కట్టుబడి ఉండాలి.
- సాధారణ పొదుపునకు సంబంధం లేకుండా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement