బంద్‌కు పిలుపునిచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు

బంద్‌కు పిలుపునిచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఒక్క రోజు బంద్‌ చేపట్టనున్నారు. మూడో వేతన సమీక్ష కమిటీ ప్రకారం వేతనాలు పెంచడం లేదని జూలై 27న వీరు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు ఆధారితంగా వేతనాలు పెంచాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. ''బీఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాల్లో నడిచే కంపెనీ అయితే అది ఉద్యోగుల వల్ల కాదని, యాంటీ-బీఎస్‌ఎన్‌ఎల్‌ విధానాలను, పద్ధతులను ప్రభుత్వం అవలంభించడంతో ఇది నష్టాల్లోకి వెళ్లింది'' అని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీ యూనియన్‌ కన్వినర్‌ పీ. అభిమన్యు చెప్పారు. 2006 నుంచి 2012 వరకు తమ మొబైల్‌ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి అవసరమైన పరికరాలను సేకరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు అనుమతే ఇవ్వలేదని తెలిపారు. ప్రైవేట్‌ టెలికాం కంపెనీలకు ప్రయోజనార్థం మొబైల్‌ పరికరాల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ చేపట్టిన టెండర్లను రద్దు చేశాయరని అభిమన్యు ఆరోపించారు. దీంతో మొబైల్‌ సెగ్మెంట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎలాంటి గణనీయమైన వృద్ధి సాధించేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. 

 

2013-14లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.691 కోట్ల నిర్వహణ నష్టాలుంటే, 2015-16కు వచ్చే సరికి అవి రూ.3,854 కోట్లకు పెరిగాయి. రిలయన్స్‌ జియో నుంచి వస్తున్న తీవ్రమైన పోటీని తట్టుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఎంతో ప్రయత్నిస్తోంది. ఈ పోటీని తట్టుకుని కూడా నెలకు బీఎస్‌ఎన్‌ఎల్‌ 20 లక్షల మంది కొత్త మొబైల్‌ కస్టమర్లను తన సొంతం చేసుకుంటుంది. వచ్చే రెండు-మూడేళ్లలో బీఎస్‌ఎన్‌ఎల్‌ లాభాల పీఎస్‌యూ కంపెనీల్లో ఒకటిగా నిలవనుందని అభిమన్యు చెప్పారు. జూలై 19న కేబినెట్‌ మూడో వేతన సమీక్ష కమిటీ ప్రతిపాదనలు ఆమోదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం, ఎవరైతే గత మూడేళ్ల నుంచి లాభాలను పొందుతున్నారో  అంటే కేవలం ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే తమ ఉద్యోగులకు వేతనాలను సమీక్షించుకునే అర్హతను పొందాయని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు చెప్పారు. ఈ మేరకు తాము జూలై 27న ఒక్క రోజు బంద్‌ను చేపట్టనున్నామని ఆఫీసర్లు, వర్కర్లు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోకపోతే, యూనియన్లు, అసోసియేషన్లు కలిసి పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు.  
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top