బీఎస్‌–6 ఇంధనం రెడీ..!

BS6 Fuel Set To Be More Expensive From April 2020 - Sakshi

డెడ్‌లైన్‌కు ముందే అందుబాటులోకి

కసరత్తు చేస్తున్న  చమురు కంపెనీలు

ప్రమాణాల అప్‌గ్రేడ్‌కు రూ.30,000 కోట్ల వ్యయం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌ స్టేజ్‌–6 (బీఎస్‌) ప్రమాణాలు దేశంలో 2020 ఏప్రిల్‌ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా బీఎస్‌–6 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందా లేదా అన్న ఆందోళన వాహన తయారీ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఈ విషయంలో ధీమాగా ఉన్నాయి. డెడ్‌లైన్‌ లోగానే బీఎస్‌–6 ఫ్యూయెల్‌ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందన్నది ఈ కంపెనీల మాట. అందుకు అనుగుణంగా ఈ దిగ్గజాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాయి కూడా. ప్రస్తుతం ఢిల్లీలో బీఎస్‌–6 ఫ్యూయెల్‌ అందుబాటులో ఉంది.

ముందు వరుసలో బీపీసీఎల్‌..
భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌) చకచకా తన ప్రణాళిక అమలును ముమ్మరం చేసింది. 2019 అక్టోబరు – 2020 జనవరి మధ్య రిటైల్‌ స్టేషన్లలో బీఎస్‌–4 స్థానంలో బీఎస్‌–6 ఇంధనం సిద్ధం చేయనుంది. జనవరికల్లా నూతన ప్రమాణాలతో ఫ్యూయెల్‌ రెడీ ఉంటుందని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బీఎస్‌–3 నుంచి బీఎస్‌–4కు మళ్లిన దానికంటే ప్రస్తుతం మరింత వేగంగా పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగంలోని ఇతర ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో పోలిస్తే బీపీసీఎల్‌ కాస్త ముందుగా బీఎస్‌–6 ఫ్యూయెల్‌ విషయంలో పావులు కదుపుతోంది.

మార్చికల్లా రెడీ..
మరో సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీఎల్‌) సైతం పనులను వేగిరం చేసింది. ఈ ఏడాది డిసెంబరులో మొదలై మార్చికల్లా కొత్త ఇంధనంతో రిటైల్‌ ఔట్‌లెట్లు సిద్ధమవుతాయని సంస్థ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ గుర్మీత్‌ సింగ్‌ వెల్లడించారు. డెడ్‌లైన్‌ కంటే నెల రోజుల ముందుగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పాత ఇంధనం స్థానంలో కొత్త ఇంధనం మార్పిడికి రెండు మూడు నెలలు పడుతుందని వివరించారు. ఇదే సమయంలో ఫ్యూయెల్‌ నాణ్యతనూ పరీక్షిస్తామన్నారు. 2020 జనవరి రెండో వారం తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్‌ స్టోర్లకు ఫ్యూయెల్‌ సరఫరా ప్రారంభిస్తామని హిందుస్తాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (హెచ్‌పీసీఎల్‌) చైర్మన్‌ ముకేష్‌ సురానా ఇటీవల వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా తెలిపారు.  

వ్యయం రూ.30,000 కోట్లు..
బీఎస్‌–4 ప్రమాణాల నుంచి బీఎస్‌–6 ప్రమాణాలకు అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇప్పటికే రిఫైనరీల అభివృద్ధికి సుమారు రూ.30,000 కోట్లు ఖర్చు చేసినట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. అటు వాహన తయారీ సంస్థలు ఏకంగా రూ.70,000–80,000 కోట్లు వ్యయం చేసినట్టు తెలుస్తోంది. బీఎస్‌–4 నుంచి బీఎస్‌–5 ప్రమాణాలకు బదులుగా బీఎస్‌–6కు మళ్లాలని 2016లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2020 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌–6 వెహికిల్స్‌ విక్రయం, రిజిస్ట్రేషన్‌ మాత్రమే చేపడతారు. ఇప్పటికే కొత్త ప్రమాణాలకు తగ్గ వాహనాలను కంపెనీలు విడుదల చేయడం ప్రారంభించాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top