ఇలాగైతే వొడాఫోన్‌ ఐడియా మూతే..

Birla Says Vodafone Idea Will Close If Government Doesnt Provide Any Relief - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : స్పెక్ర్టమ్‌ చెల్లింపులు, లైసెన్స్‌ ఫీజుల బకాయిల విషయంలో ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరించని పక్షంలో దేశంలో మూడో అతిపెద్ద మొబైల్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ వొడాఫోన్‌ ఇండియా మూతపడుతుందని సంస్థ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి తమకు తక్షణ సాయం లభించకుంటే వొడాఫోన్‌ ఐడియా కథ ముగిసినట్టేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ చెల్లించాల్సిన రూ 53,058 కోట్ల బకాయిలపై ప్రభుత్వం తమకు భరోసా ఇవ్వకుంటే సంస్థ మనుగడ కష్టమేనని ఆయన వ్యాఖ్యానించారు. ముఖేష్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియో కారుచౌక మొబైల్‌ టారిఫ్‌ను ఎదుర్కొనేందుకు గత ఏడాది ఐడియా సెల్యులార్‌, బ్రిటన్‌ టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ ఇండియాలు ఒకే కంపెనీగా విలీనమైన సంగతి తెలిసిందే.

దీంతో వొడాఫోన్‌ ఐడియా సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలతో సహా రుణభారం రూ 1.17 లక్షల కోట్లకు చేరింది. భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, ఇతర టెలికాం కంపెనీలు కలసి టెలికాం లైసెన్స్‌ ఫీజు, స్పెక్ర్టమ్‌ యూసేజ్‌ చార్జీలు కలుపుకుని గత 14 ఏళ్లకు గాను ప్రభుత్వానికి రూ 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలపై వడ్డీ, జరిమానాను మాఫీ చేయాలని భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కోరుతున్నాయి. ఇక ప్రభుత్వం టెలికాం రంగాన్నే కాకుండా ఆరేళ్ల కనిష్టస్ధాయిలో జీడీపీ వృద్ధి 4.5 శాతానికి దిగజారిన క్రమంలో పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం సాయం ప్రకటిస్తుందని ఐడియా వొడాఫోన్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top